Ola Electric | ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ తాజాగా ఓ అరుదైన రికార్డు నెలకొల్పింది. 20 వేల టెస్ట్ రైడ్లు పూర్తి చేసింది. ఎస్1, ఎస్1 ప్రో మోడల్ స్కూటర్లతో విపణిలోకి వచ్చిన ఓలా ఎలక్ట్రిక్‌కు అతి తక్కువ టైంలో 10 లక్షల బుకింగ్స్ నమోదు చేసింది. తద్వారా ప్రత్యర్థి ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థలకు సవాల్ విసిరింది. గత నెల 10న బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాల్లో, 19న చెన్నై, హైదరాబాద్, కోచి, ముంబై, పుణె నగరాల్లో టెస్ట్ రైడ్లు పూర్తి చేసింది.
అన్ని రకాల రోడ్లపై టెస్ట్ రైడ్లు జరుపాలని ఓలా ఎలక్ట్రిక్ భావిస్తున్నది. వెయ్యి నగరాల్లో రోజుకు 10 వేల టెస్ట్ రైడ్లు జరుపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భవిష్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ మౌలిక వసతులను మెరుగు పరిచేందుకు ఓలా సన్నాహాలు చేస్తున్నది. సొంతంగా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేయడంలో మునిగిపోయింది. మొత్తం 400 నగరాల్లో లక్ష చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ఓలా ఎలక్ట్రిక్ యోచిస్తున్నది.