Ola Electric | చిప్‌లు, సెమీ కండక్టర్ల కొరతతో అంతర్జాతీయంగా.. జాతీయంగా ఆటోమొబైల్ కంపెనీలు అల్లాడుతున్నాయి. ఉత్పత్తి లక్ష్యాలను కుదించేస్తున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, బైక్స్‌లో చిప్‌లు తప్పనిసరి.. అయినా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. చిప్‌ల కొరత సమస్యను అధిగమించింది. తొలి విడుత ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని పూర్తి చేసినట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భావేశ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఆగస్టు 15న ఆవిష్కరించిన తర్వాత ఈ-స్కూటర్ల కోసం వేలాది మంది బుక్ చేసుకున్నారు. నాటి నుంచి తమ ఈ- స్కూటర్ల కోసం వేచి ఉన్నారు.
ఇప్పటికే తమ వాహనాలు కొన్న వారికి డెలివరీలను పూర్తి చేశాం అని ట్వీట్లో భావేశ్ అగర్వాల్ తెలిపారు. చాలా స్కూటర్లు డెలివరీ సెంటర్లు.. మరికొన్ని మార్గ మధ్యలో ఉన్నాయన్నారు. ఆర్టీవో రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత కస్టమర్ల దరి చేరతాయని ట్వీట్ చేశారు. డిజిటల్ విధానం అందరికీ కొత్త కావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మందకోడిగా జరుగుతోందని అగర్వాల్ వెల్లడించారు.
డిసెంబర్ 15 నుంచి ఓలా తన ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్ల డెలివరీలు ప్రారంభించింది. దీంతోపాటు తొలి 100 మంది కస్టమర్ల కోసం బెంగళూరు, చైనా ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించింది. తమ కస్టమర్లే తమకు చాలా ముఖ్యం అని ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అరుణ్ శ్రీదేశ్ముఖ్ ఇటీవలే చెప్పారు. కస్టమర్ల నుంచి వచ్చిన సానుకూల ఫీడ్‌బ్యాక్‌లో రవాణా సమస్యలను తమ దృష్టికి వచ్చాయని, వాటిని వేగంగా పరిష్కరించామని తెలిపారు.