అంతర్జాతీయ ప్రతికూలతలతో పాటు సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్ సందర్భంగా నిర్ణీత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 36 పాయింట్ల స్వల్పనష్టంతో 19,638 వద్ద ముగిసింది. యూఎస్ బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్, కీలకమైన స్పెండింగ్ బిల్లు అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందడం తదితర అంశాలు ఈ వారం మార్కెట్ కదలికలకు కీలకం కానున్నాయి. అక్టోబర్ 2న (సోమవారం) గాంధీ జయంతి కారణంగా ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమవుతున్నది. అయినప్పటికీ మార్కెట్ పరిమిత శ్రేణిలో ఒడిదుడుకులకు లోనుకావచ్చని అధిక శాతం మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత వారం నిఫ్టీ డెయిలీ చార్టుల్లో 20 డీఎంఏ, 50 డీఎంఏల దిగువన ముగియడం స్వల్పకాలిక బలహీనతను సూచిస్తున్నదని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది తెలిపారు. అలాగే ఇండియా వొలటాలిటీ ఇండెక్స్ (వీఐఎక్స్) 7 శాతంపైగా పెరగడం ఇన్వెస్టర్లకు ఆందోళన కల్గించే అంశమని జిమిత్ మోదీ చెప్పారు.
కీలక మద్దతు 19,400
ఈ వారం నిఫ్టీకి 19,400 పాయింట్ల స్థాయి వద్ద కీలక మద్దతు లభించవచ్చని, 19,850-19,900 శ్రేణి వద్ద అవరోధం ఏర్పడవచ్చని జిమిత్ మోదీ అంచనా వేశారు. ర్యాలీ జరగాలంటే 19,750 పాయింట్లపైన నిఫ్టీ ముగియాలని, అటుపైన నిలదొక్కుకుంటే అక్టోబర్ సిరీస్లో 20,500-20,700 స్థాయిల్ని అందుకోవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రూపక్ డే విశ్లేషించారు. ఈ వారం నిఫ్టీ 19,470 వద్ద మద్దతు పొందవచ్చని అంచనా వేశారు. ఇక ఈ వారం ప్రథమార్థంలో 19,500 పాయింట్ల వద్ద ఇంట్రాడే సపోర్ట్ లభించవచ్చని, ఇంట్రాడేలో తగ్గినా 19,600పైన ముగిస్తే బుల్లిష్ లేదా సైడ్వేస్ ధోరణిలో సూచి ఉంటుందని చార్ట్ ఎనలిటిక్స్ ఫౌండర్ ఎం చెద్దా తెలిపారు.