న్యూఢిల్లీ, అక్టోబర్ 23: నిరంతర చెక్ క్లియరింగ్ వ్యవస్థలో కొన్ని ఆరంభ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) గురువారం స్పష్టం చేసింది. ఈ నెల 4న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నిరంతర చెక్ క్లియరింగ్ సిస్టమ్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్పటిదాకా విడుతలవారీగా చెక్కుల క్లియరెన్స్‌కు రెండు రోజులదాకా పడుతున్న సమయం కాస్తా కొద్ది గంటలకే దిగొచ్చింది.
బ్యాంక్‌లో ఏ రోజైతే క్లియరెన్స్ కోసం చెక్ వేస్తామో.. అదేరోజు కేవలం కొద్ది గంటల్లోనే పనైపోతున్నది. అయినప్పటికీ కొందరు కస్టమర్లకు అసౌకర్యం కలుగుతుండటంపట్ల ఎన్పీసీఐ విచారం వ్యక్తం చేసింది. అయితే వేగవంతమైన సేవలకు కట్టుబడి ఉన్నామన్న ఎన్పీసీఐ.. వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తామన్న భరోసాను ఇచ్చింది. ఆర్బీఐ, భారతీయ బ్యాంకుల సంఘం కలిసి ఏర్పాటు చేసినదే ఈ ఎన్పీసీఐ. దేశీయంగా రిటైల్ పేమెంట్స్, సెటిల్మెంట్ సిస్టమ్స్ పర్యవేక్షణ ఎన్పీసీఐ బాధ్యతే.