Google New Feature | ప్రైవసీని కాపాడుకోవాలన్న స్మార్ట్ ఫోన్ యూజర్ల ఆకాంక్షల మేరకు సెర్చింజన్ గూగుల్.. ఫొటోస్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ లాక్ ఫోల్డర్ పేరిట తీసుకొచ్చిన ఈ ఫీచర్.. యూజర్ గ్యాలరీలోని ఫొటోలను ఇతరులకు కనిపించనివ్వదు. ఇప్పటివరకు ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. దీన్ని ఇతర ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చామని గూగుల్ వెల్లడించింది.
గత మేలో నిర్వహించిన గూగుల్ ఇన్పుట్/ఔట్పుట్ ఈవెంట్లో ఈ లాకర్ ఫోల్డర్ ఫీచర్ సంగతి ప్రకటించింది. ఇతరులు చూడకూడదని యూజర్ అనుకున్న ఫొటోలకు లాకర్ ఫోల్డర్‌తో భద్రత కల్పించొచ్చు. మీ మిత్రులెవరైనా మీ ఫోన్లో ఫొటో గ్యాలరీ చూస్తున్నప్పుడు లాకర్ ఫోల్డర్లో ఉంచిన ఫొటోలు కనిపించవు.
స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ ఫీచర్ కోసం గూగుల్ ఫొటోలు ఓపెన్ చేసి లైబ్రరీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో యుటిలిటీస్‌పై క్లిక్ చేసి కిందకు స్క్రోల్ చేస్తే లాకర్ ఫోల్డర్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేశాక పిన్ సెట్ చేయాలని అడుగుతుంది. తర్వాత లాకర్ ఫోల్డర్లో ఉంచాలనుకున్న ఫొటోలను సెలెక్ట్ చేసి అందులోకి తరలించాలి. ఈ ఫీచర్లో స్టోర్ చేసిన ఫొటోలు బ్యాకప్‌లో కనిపించవు. ఒకవేళ ఈ ఫొటోలు మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే ప్రత్యేక ఫోల్డర్లో స్టోర్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. ఒకవేళ ఫోన్ నుంచి గూగుల్ ఫొటోస్ యాప్ డిలిట్ చేస్తే లాకర్ ఫోల్డర్‌లోని ఫొటోలు డిలీట్ అయిపోతాయని తెలిపింది.