హవానా: బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను నియంత్రించడానికి కరేబియన్ దేశం క్యూబా సిద్ధమైంది. ఈ మేరకు మూడు రోజుల క్రితం అధికారిక గెజిట్లో ప్రకటించింది. వర్చువల్ కరెన్సీల విధి విధానాలను, మార్గదర్శకాలను ‘సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ క్యూబా’ ఖరారు చేస్తుందని ఆ గెజిట్లో పేర్కొంది. సామాజిక ఆర్థిక ప్రయోజనాల రీత్యా వాణిజ్య లావాదేవీల్లో వర్చువల్ కరెన్సీల వాడేందుకు అనుమతించవచ్చునని ఆ గెజిట్ వెల్లడించింది.
ఫైనాన్సియల్, ఎక్స్చేంజ్, వసూళ్లు లేదా చెల్లింపుల కార్యక్రమాలకు వర్చువల్ కరెన్సీ సర్వీస్ ప్రొవైడర్లకు లైసెన్స్లు ఇస్తామని వివరించింది. వాణిజ్య లావాదేవీల్లో క్యూబాకు అమెరికా డాలర్లను వాడటం కష్టసాధ్యంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో విధించిన ఆంక్షలే దీనికి కారణం. ఈ నేపథ్యంలో టెక్నాలజీకల్గా పురోగతి సాధించిన క్యూబాలో వర్చువల్ కరెన్సీలకు పలుకుబడి పెరిగింది.