Niti Aayog | నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్‌గా సుమన్ కే బెరీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది. వచ్చేనెల ఒకటో తేదీన సుమన్ కే బెరీ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్‌గా పని చేస్తున్న రాజీవ్‌కుమార్ అకస్మికంగా రాజీనామా చేశారు. ఈ నెలాఖరు వరకు రాజీవ్ కుమార్ పదవీ కాలం ఉంది. 2017 ఆగస్టులో అప్పటి నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్‌గా అరవింద్ పనగరియా రాజీనామా చేయడంతో రాజీవ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.
రాజీవ్ కుమార్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 30న ఆయన పూర్తిగా బాధ్యతల నుంచి వైదొలుగుతారని తెలిపింది. వ్యవసాయ రంగం, పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాల్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. లక్నో యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన రాజీవ్ కుమార్.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డీఫిల్ పూర్తి చేశారు. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సీనియర్ ఫెలోగా ఉన్నారు.
కొత్తగా నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్‌గా నియమితులైన సుమన్ కే బెరీ ఇంతకుముందు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) డైరెక్టర్ జనరల్ (చీఫ్ ఎగ్జిక్యూటివ్)గా పని చేశారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడిగానూ సేవలందించారు.