Google Pay | న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రముఖ పేమెంట్స్ యాప్ గూగుల్ పేలో కొత్త ఫీచర్లను తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే శుక్రవారం యూపీఐ సర్కిల్సహా మరికొన్నింటిని పరిచయం చేశారు. ముంబైలో 3 రోజులపాటు జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2024 ముగింపు సందర్భంగా ఈ మేరకు గూగుల్ పే నుంచి ప్రకటనలు వచ్చాయి. కాగా, యూపీఐ సర్కిల్‌తో గూగుల్ పే వినియోగదారులు (ప్రైమరీ యూజర్లు) తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా అనుమతించవచ్చు. దీంతో తమ బ్యాంక్ ఖాతాను లింక్ చేసుకోకుండానే ఇకపై వీరంతా కూడా ప్రైమరీ యూజర్ అకౌంట్ ద్వారానే డిజిటల్ చెల్లింపులను జరుపుకోవచ్చు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామ్యంతో దీన్ని తీసుకొచ్చింది. అలాగే ఈ సందర్భంగా యూపీఐ వోచర్స్ (ఈరూపీ)నూ గూగుల్ పే ప్రారంభించింది. ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలతోపాటు ప్రస్తుత యూపీఐ వినియోగదారులు వీటిని జారీ చేయవచ్చు. అంతేగాక రూపే కార్డుల కోసం ట్యాప్‌అండ్‌పే చెల్లింపుల సౌకర్యాన్నీ కల్పించింది. ఈ పేమెంట్స్ కోసం రూపే కార్డుదారులు తమ మొబైల్ ఫోన్లను కార్డులతో అనుసంధానించుకోవాల్సి ఉం టుంది. యూపీఐ లైట్ కోసం ఆటోపే ఆప్షన్, యాప్‌పై క్లిక్‌పే క్యూఆర్ కోసం సపోర్ట్‌నూ అందిస్తున్నది. కాగా, ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్‌ను మరింత విస్తృతపర్చడానికి ఈ నెలలో జరిగిన ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయాలు, ఇచ్చిన అనుమతుల మేరకే ఈ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.