Buy a Car | న్యూఢిల్లీ, జూలై 31: నూతన కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా! అయితే మరో కొద్ది రోజులు ఆగండి. కొత్త కొత్త మాడళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చేది పండుగ సీజన్ కావడంతో అంతకుముందే కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలను(ఎస్యూవీ) విడుదల చేయగా..తాజాగా ఈ జాబితాలోకి టాటా, బెంజ్, ఆడీ, టయోటా, వోల్వో, హ్యుందాయ్‌లు చేరాయి. చిన్న స్థాయి వాహనాలకు డిమాండ్ పడిపోవడంతో ఇక ఆటోమొబైల్ సంస్థలు లగ్జరీ సెగ్మెంట్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. వచ్చే నెలలో విడుదల కానున్న పలు ఎస్యూవీ మాడళ్లపై లుక్కెయండి..
సీఎన్జీలో టాటా పంచ్
ఈ ఏడాది మొదట్లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన టాటా మోటర్స్‌కు చెందిన పంచ్ సీఎన్జీ వెర్షన్‌ను వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇది టాటా నుంచి విడుదలకానున్న నాలుగో సీఎన్జీ మాడల్ కావడం విశేషం. 1.2 లీటర్ల, మూడు సిలిండర్ ఇంజిన్ కలిగిన పెట్రోల్ వెర్షన్లో 5 మాన్యువల్ గేర్లు కలవు. హ్యుందాయ్ ఎక్స్టర్ సీఎన్జీ వెర్షన్‌కు పోటీగా సంస్థ ఈ మాడల్‌ను పరిచయం చేయనున్నది.
నయా మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ
మెర్సిడెజ్ బెంజ్..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది. సెకండ్ జనరేషన్ జీఎల్సీ ఎస్‌యూవీని వచ్చే నెల 9న అందుబాటులోకి తీసుకురాబోతున్నది. జీఎల్సీ 300 పెట్రోల్, జీఎల్సీ 220 డీ డీజిల్ ఈ రెండు మాడళ్లు 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రూపొందించింది. 12.3 అంగుళాల డిజిటల్ స్క్రీన్‌తోపాటు 11.9 అంగుళాల ఒరియంటెడ్ టచ్‌స్క్రీన్ కూడా ఉన్నది.
ఆడీ క్యూ8 ఈ-ట్రాన్..
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి క్యూ8 ఈ-ట్రాన్ ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకురాబోతున్నది. 95 కిలోవాట్ల, 114 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ సింగిల్ చార్జ్‌తో 600 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చును. రెండు ఎలక్ట్రిక్ మోటార్ కలిగిన ఈ మాడల్ వేగంగా చార్జీంగ్ అవడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసింది.
టయోటా రుమియాన్
దేశీయ మార్కెట్లోకి చిన్న స్థాయి మళ్లీపర్పస్ వాహనమైన రుమియాన్ను విడుదల చేయబోతున్నది. మారుతికి చెందిన ఎర్టిగా లాగా ఉండే ఈ మాడల్ ఇప్పటికే దక్షిణాఫ్రికాలో అందుబాటులోకి తీసుకొచ్చింది కూడా. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మాడల్‌లో 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి.
వోల్వో సీ40 రీచార్జ్
అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థ వోల్వో..దేశీయ మార్కెట్లోకి రెండో ఈవీని ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. వచ్చే నెలలో విడుదల చేసి, ఆ మరుసటి నెల నుంచి కస్టమర్లకు అందచేయనున్నది. 9.0 అంగుళాల పోట్రెయిట్ ఓరియంటల్ టచ్‌స్క్రీన్, రెండు రకాల మోటార్ కలిగిన ఈ మాడల్ 408 హెచ్‌పీల శక్తినివ్వనున్నది. 78కిలోవాట్ల కలిగిన బ్యాటరీ సింగిల్ చార్జ్‌తో 530 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
అడ్వెంచర్ ఎడిషన్‌గా క్రెటా, అల్కాజర్
అడ్వెంచర్ ఎడిషన్‌గా క్రెటా, అల్కాజర్‌ను విడుదల చేయబోతున్నది హ్యుందాయ్. నూతనంగా తీర్చిదిద్దిన ఈ మాడల్‌లో బ్లాక్-ఇంటీరియర్‌గా మార్చింది.