Myntra -Quick Commerce | ఫ్లిప్ కార్ట్ అనుబంధ లైఫ్ స్టైల్ ఈ-కామర్స్ సంస్థ మైంత్రా (Myntra) క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంటరయ్యేందుకు సన్నద్ధం అవుతున్నది. ఆర్డర్ వచ్చిన రెండు గంటల్లోనే డెలివరీ చేయడానికి కసరత్తు చేస్తున్నది. ప్రయోగాత్మకంగా బెంగళూరు నగరంలో ఈ సేవలందిస్తున్నది. ఎం-నౌ పేరిట సెలెక్టెడ్ పిన్ కోడ్స్ లో ఈ సేవల తీరును పరిశీలిస్తున్న మైంత్రా.. సెలెక్టెడ్ ప్రొడక్టులను మాత్రమే ప్రయోగాత్మకంగా యూజర్లకు అందిస్తున్నది. ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా ఇతర ప్రాంతాలకూ క్విక్ కామర్స్ సేవలు విస్తరిస్తామని మైంత్రా తెలిపింది.
దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీల్లో 2022లో మైంత్రా ఎక్స్ ప్రెస్ డెలివరీ సేవలు ప్రారంభించింది. ఆర్డర్ పెట్టిన 24-48 గంటల్లో ప్రొడక్టులు డెలివరీ చేయడమే దీని ప్రధానోద్దేశం. ఇప్పుడు గ్రాసరీ విభాగంలో క్విక్ కామర్స్ సేవలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మైంత్రా సైతం ఆ విభాగంలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. క్విక్ కామర్స్ రంగంలో పని చేస్తున్న సంస్థలు బ్యూటీ, ఫ్యాషన్ క్యాటగిరీ వస్తువులను చేర్చుకుని ముందుకు వెళుతున్న నేపథ్యంలో మైంత్రా సైతం ఆ రంగంలోకి రావాలని ప్రయత్నించడం ఆసక్తికర పరిణామం.