Bullion Market | నేటి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు ఎన్నో మార్గాలున్నాయి. స్టాక్స్, బాండ్ల దగ్గర్నుంచి రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్ల వరకు మదుపునకు బోలెడు అవకాశాలు. తద్వారా ఒకప్పటితో పోల్చితే మనకున్న ఆదాయాన్ని అనేక రెట్లు పెంచుకోగలుగుతున్నాం కూడా. అయితే వీటన్నిటిలో బంగారంపై పెట్టుబడి అనేది ఎప్పటికీ ఎవర్గ్రీన్ అనే చెప్పాలి. ఇదో సురక్షిత, స్థిరమైన పెట్టుబడి కావడమే ఇందుకు కారణం. ఇక గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేక రూపాల్లో ఉంటాయి. ఆభరణాలు, డిజిటల్ గోల్డ్, సావరిన్ బాండ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌లు ఇలా రకరకాలున్నాయి. అయినప్పటికీ భౌతిక రూపంలో బంగారపు కడ్డీలు, నాణేల్లో పెట్టుబడే అత్యంత సురక్షితం. అంతేగాక తెలివైన, చక్కని ఆలోచన.
గోల్డ్, బులియన్‌కు మధ్య ప్రధాన తేడా దాని రూపం, స్వచ్ఛత, పెట్టుబడి కోణాలే. సాధారణంగా బులియన్.. బంగారు కడ్డీలు, నాణేల రూపంలో ఉంటుంది. అత్యంత స్వచ్ఛత, అత్యధిక విలువ దీని సొంతం. ఇక కడ్డీలు, నాణేల్లో గోల్డ్ లభించినా.. నగలు, బాండ్లు ఇతరత్రా రూపాల్లోనూ ఉంటుంది. స్వచ్ఛత, విలువల్లో వ్యత్యాసాలుంటాయి. అయితే బులియన్లోనే ఎందుకు మదుపు చేయాలంటే?..
బులియన్ అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనాల్లో ఒకటి. ఇతర రూపాల్లో కంటే ఇందులో బంగారం విలువ స్థిరంగా ఉంటుంది. పైగా ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో మరింత లాభదాయకంగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే కచ్ఛితమైన రాబడులకు వీలుంటుంది.
మనకు అవసరమైతే, ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడైనా నగదుగా మార్చుకోవడానికి అత్యంత సౌకర్యవంతంగా ఈ పుత్తడి ఉంటుంది. స్వచ్ఛత, విలువపరంగా ఎంతమాత్రం వేచిచూడాల్సిన పనిలేదు. రియల్ ఎస్టేట్, ఇతర బాండ్లలో, నగల్లో ఈ అవకాశాలు తక్కువ.
బులియన్లో పెట్టుబడికి మార్కెట్ పరిజ్ఞానంతో పనిలేదు. స్టాక్ లేదా బాండ్ మార్కెట్లలో మార్కెట్ అవగాహన మదుపరులకు ఉండాల్సిందే. దీంతో కొత్తగా పెట్టుబడుల్లోకి వచ్చేవారు బులియన్ మార్కెట్‌ను వేదికగా ఎంచుకోవచ్చు.
భారతీయుల సంస్కృతిలో బంగారం కూడా ఒక భాగమే. అందుకే చాలామంది పుత్తడిని ఓ విలువైన లోహంగానో, పెట్టుబడిగానో చూడటం కంటే దాన్ని ఓ సెంటిమెంట్‌గా భావిస్తారు. అందులో దైవత్వాన్నీ చూస్తారు. ఇదికూడా దేశీయ మార్కెట్లో పసిడికి వన్నె తగ్గకుండా చేస్తున్నది.
ప్రతీ పెట్టుబడిలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే మరింత రాబడులను ఒడిసి పట్టుకోవచ్చు. బంగారం విషయంలోనూ ఇంతే. అందుకున్న మార్గాలను పరిశీలిస్తే..
చిన్నచిన్నగా పెట్టుబడులు పెట్టడం.. ఓ ప్రభావవంతమైన వ్యూహం అని చెప్పవచ్చు. మార్కెట్ పరిస్థితులనుబట్టి క్రమేణా మన పెట్టుబడులను పెంచుతూపోవాలి. దీనివల్ల ఆకస్మిక నష్టాలను అధిగమించవచ్చు.
మొదట్లో నాణేలపై పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ ట్రేడింగ్ సులభంగా ఉంటుంది. ఆ తర్వాత పెద్దపెద్ద కడ్డీలవైపు వెళ్లాలి. ఈ మార్పు.. అమ్మకాలు, మీ పసిడి ఆస్తుల నిర్వహణను రక్షణాత్మకంగా మార్చగలదు.
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌నుబట్టి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. గోల్డ్ మార్కెట్‌నూ అనేక అంశాలు ప్రభావితం చేస్తూంటాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు కీలకం. కాబట్టి ఇతర మార్కెట్లు క్షీణిస్తుంటే.. గోల్డ్‌కు డిమాండ్ ఉంటుందని గుడ్డిగా అనుసరించకూడదు. పరిస్థితులనుబట్టి పెట్టుబడుల కోసం ముందుకెళ్లాలి.
భౌతిక బంగారంపై పెట్టుబడులు పెడుతున్నప్పుడు బ్యాంక్ లాకర్లు లేదా ప్రొఫెషనల్ వాల్ట్ సర్వీసులను మీ బులియన్ నిల్వల కోసం ఎంచుకోవడం ఉత్తమమని మరువద్దు.
దేశీయంగా పసిడి క్రయవిక్రయాలు చేసేటప్పుడు పన్నులను చూసుకోవాలి. అప్పుడప్పుడు పన్నులు ఎక్కువగా ఉంటుంటాయి. దీనివల్ల వచ్చే లాభాలు పన్ను చెల్లింపులకే పోతాయి. కనుక పన్ను మినహాయింపులు, పన్నుల నుంచి చట్టబద్ధంగా ఉండే వెసులుబాట్లను తెలుసుకోవడం లాభదాయకం.
ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు రికార్డు స్థాయిల్లో పరుగులు పెడుతున్నాయి. దేశీయంగా తులం ధర లక్ష రూపాయలకు చేరువైంది. ఈ నేపథ్యంలో పసిడి కొనుగోళ్లపై ఆచితూచి ముందుకెళ్లడం మంచిది. పెద్ద ఎత్తున కొనాలనుకున్నప్పుడు మార్కెట్ పరిణామాలను పరిశీలిస్తూ వెళ్లడమే తెలివైన మార్గం.