న్యూఢిల్లీ, జూలై 5: దేశంలో రుణ భారంతో మరిన్ని కంపెనీలు డిఫాల్ట్ అవుతాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ హెచ్చరించింది. కొవిడ్ పాండమిక్‌తో ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాల ఉపసంహరణ జరుగుతుందని, దీంతో పాటు ముడి పదార్థాల ధరలు అధికస్థాయిలో ఉన్నందున కంపెనీల వ్యయాలపై ఒత్తిడి ఏర్పడుతుందని క్రిసిల్ అంచనా వేసింది. దీంతో సబ్-ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్యాటగిరీలో ఉన్న కంపెనీలు ప్రత్యేకించి ఎంఎస్ఎంఈలు డిఫాల్ట్ అయ్యే అవకాశం ఉందన్నది.
గత దశాబ్దంలో వార్షిక డిఫాల్ట్ రేట్ 4.1 శాతం ఉండగా, 2021 ఆర్థిక సంవత్సరంలో 2 శాతానికి, 2022లో 2.2 శాతానికి డిఫాల్ట్‌లు తగ్గాయని, 2023లో ఇవి పెరుగుతాయని అంచనా వేసింది. అలాగే ఎంఎస్ఎంఈలు 90 శాతం ఉన్న సబ్-ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్యాటగిరీలో 2021లో డిఫాల్ట్ రేట్ 3.90 శాతంకాగా, 2022లో ఇది 5.24 శాతానికి పెరిగిందన్నది. 2011-2020లో వీటి సగటు వార్షిక డిఫాల్ట్ రేట్ 6.1 శాతంకాగా, గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కొవిడ్ సంక్షోభం కారణంగా లోన్ మారిటోరియం, ఎమర్జన్సీ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ వంటి ప్రోత్సాహకాలతో డిఫాల్ట్‌లు తగ్గాయని, ఇవి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ హెచ్చరించింది.