హైదరాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల రంగం పూర్తిగా పడకేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపంతో నరేంద్ర మోదీ సర్కార్ అమలుచేస్తున్న ఒక్క పథకం కూడా రాష్ట్రంలో అమలుకు నోచుకోవడంలేదు. కేంద్ర పథకాల ద్వారా ఎంతమంది ప్రయోజనం పొందుతు న్నారో.. అనే విషయం అటు ఎంఎస్ఎంఈ అధికారులకు, ఇటు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులకు కూడా తెలియదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైరవీలు, పలుకుబడి ఉన్నవారికే సెంట్రల్ గవర్నమెంట్ పథకాల ప్రయోజనం అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్ఎస్ఎస్హెచ్ కింద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన చిన్న పరిశ్రమలకు యంత్రాల కొనుగోలు చేసేందుకు గరిష్ఠంగా 40 శాతం సబ్సిడీతో రూ.25 లక్షల వరకు, పీఎంఈజీపీ కింద గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టుకునే వారికి 25-35 శాతం సబ్సిడీ, పట్టణాల్లో 15- 25 శాతం సబ్సిడీ, ఖాదీ గ్రామీణ ఉద్యోగ్ తదితర పథకాలు ఇందులో ముఖ్యమైనవి. అయితే, వివిధ పథకాలకు రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ప్రయోజనాలు అందుతున్నది మాత్రం అరకొర మందికే. సహజంగా కేంద్రం అమలుచేసే పథకాలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. కానీ, ఈ పథకాల విషయంలో మాత్రం ప్రభుత్వ అధికారులు ఎవరికివారే అనే విధంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పరిశ్రమలకు సంబంధించిన ఏ పథకమూ సక్రమంగా అమలు కావడంలేదని పరిశ్రమ వర్గాలు ఆందోళనవ్యక్తం చేస్తుండగా.. కనీసం కేంద్ర ప్రభుత్వ పథకాలైనా అమలవుతున్నాయా.. అంటే వాటి పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.
రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, సబ్సిడీల వివరాలపై బాలనగర్ ఎంఎస్ఎంఈకి చెందిన ఓ ఉన్నతాధికారిని ప్రశ్నించగా, రాష్ట్రంలో ఎంతమందికి సబ్సిడీలు వచ్చాయో చెప్పడం సాధ్యంకాదని పేర్కొన్నారు. ఇటు రాష్ట్ర పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారిని సంప్రదించగా, అసలు ఎంఎస్ఎంఈ శాఖ ఏమి చేస్తున్నదో తమకు తెలియదని, వారు సమాచారం ఇవ్వడంలేదని తెలిపారు. కాగా, పరిశ్రమ వర్గాలు మాత్రం ఎంఎస్ఎంఈ పథకాలు కేవలం పైరవీలు చేసుకునేవారికి మాత్రమే లభిస్తాయని, ఎవరికి సబ్సిడీలు వచ్చాయో అనే విషయం పక్కనున్న వారికి కూడా తెలియదని పేర్కొన్నారు. అంతా గోప్యంగా సాగుతుందని, ఈ మధ్య కాలంలో కేంద్ర సబ్సిడీలు మన రాష్ర్టానికి రావడంలేదని ఆయన చెప్పారు. తమకు తెలిసిన చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వివిధ ఎంఎస్ఎంఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్నా ఎవ్వరికీ సబ్సిడీలు రాలేదని ఆయన ఉదహరించారు.