న్యూఢిల్లీ, జూన్ 13: ఫార్ముల్లా రేసింగ్..ఫన్‌స్కూల్ టాయ్స్‌తో దేశంలో సుపరిచితమైన ఎంఆర్ఎఫ్ మంగళవారం భారత స్టాక్ మార్కెట్లో చరిత్ర సృష్టించింది. ఈ టైర్ల తయారీ కంపెనీ షేరు లక్ష రూపాయల మార్క్‌ను అందుకున్నది. ఎన్ఎస్ఈలో ఎంఆర్ఎఫ్ స్టాక్ రూ.1,00,440 రికార్డు గరిష్ఠాన్ని తాకిన అనంతరం రూ.99,993 వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్లో తొలిసారి రూ.1 లక్ష దాటిన షేరు ఇదేకావడం విశేషం. మెమ్మన్ కుటుంబం 1960వ దశకంలో ఒక అమెరికా సంస్థ భాగస్వామ్యంతో చెన్నైలో నెలకొల్పిన ఎంఆర్ఎఫ్.. టైర్ల తయారీలోనే కాకుండా సబ్సిడరీ ద్వారా ఫన్‌స్కూల్ టాయ్స్ ఉత్పత్తిలో సైతం ప్రాచుర్యం సంపాదించింది. మూడు దశాబ్దాల క్రితం ఈ కంపెనీ స్పాన్సర్ చేసిన ఫార్ముల్లా రేసింగ్ క్రీడకు దేశ, విదేశాల్లో ఎంతో క్రేజ్ ఏర్పడింది.
పెద్ద వాటా పబ్లిక్దే
ప్రస్తుతం ఎంఆర్ఎఫ్ నిర్వహణ మోమ్మన్ కుటుంబం చేతిలోనే ఉన్నప్పటికీ, ప్రమోటర్లకు ఈ కంపెనీలో 27.84 శాతం వాటా మాత్రమే ఉంది. దేశీయ ఫండ్స్, విదేశీ ఇన్వెస్టర్లతో కలుకుకుని మొత్తం పబ్లిక్ వాటా 72 శాతం కాగా, ఇందులో 12.73 శాతం షేర్లు చిన్న ఇన్వెస్టర్ల చెంతే ఉన్నాయి. రూ.10 ముఖ విలువగల ఎంఆర్ఎఫ్ షేరును ఇతర పెద్ద షేర్లలా విభజించనందునే, ధర చాలా ఎక్కువగా కన్పిస్తున్నదిగానీ, ఈ ధర షేరు పుస్తక విలువకు 2.89 రెట్లు మాత్రమే ఉన్నది. కంపెనీ లాభాలతో పోలిస్తే ధర 55 రెట్లుగా (పీఈ) ట్రేడవుతున్నది. టైర్ల కంపెనీకి ఈ పీఈ విలువ అధికమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంఆర్ఎఫ్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.42,500 కోట్లు.