గౌతమ్ అదానీకి మరో ఎదురుదెబ్బ. ఇప్పటికే ఓవైపు స్టాక్ మార్కెట్లలో నష్టాలు, మరోవైపు బాండ్ మార్కెట్లలో కష్టాలను ఎదుర్కొంటున్న అదానీ సంస్థలకు.. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రూపంలో ఇంకో షాక్ తగిలింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: అదానీ గ్రూప్ కంపెనీల రేటింగ్ ఔట్‌లుక్‌కు మూడీస్ తాజాగా కోత పెట్టింది. గ్రూప్‌లోని నాలుగు సంస్థల ఔట్‌లుక్‌ను ‘నెగెటివ్’గా మార్చింది. అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్ రిపోర్టు నేపథ్యంలో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ లక్షల కోట్ల రూపాయల్లో హరించుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గౌతమ్ అదానీకి చెందిన పలు సంస్థలను స్థిరత్వం నుంచి ప్రతికూలంలోకి మూడీస్ సవరించింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్-వన్ లిమిటెడ్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌ల రేటింగ్ ఔట్‌లుక్‌ను స్టేబుల్ నుంచి నెగెటివ్‌లోకి మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ శుక్రవారం మార్చింది. హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో అదానీ కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తుండటమే ఇందుకు కారణమని మూడీస్ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘బీఏ3’ హోదానే ఉంచింది.