Hindustan Zinc | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ‘భలే మంచి చౌక బేరము.. ఇది సమయము మించినన్ దొరకదు త్వరంగొనుడు సుజనులారా’ అన్నట్టు ప్రభుత్వ రంగ సంస్థల విక్రయానికి, ప్రైవేట్ రంగ కంపెనీల్లో మిగులు వాటాల అమ్మకానికి దేశ, విదేశాల్లో మోదీ సర్కారు చక్కర్లు కొడుతున్నది. ఒకప్పుడు సర్కారీ సంస్థగా, ఇప్పుడు వేదాంత గ్రూప్ కంపెనీగా ఉన్న హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌లో కేంద్ర ప్రభుత్వానికి 29.5 శాతం వాటా ఉన్నది. దీన్ని అమ్ముకొనేందుకు గత 15 రోజుల్లో ముంబై, లండన్, బోస్టన్, న్యూయార్క్ వంటి ప్రముఖ నగరాల్లో కేంద్రం రోడ్‌షోలు నిర్వహించింది.
మదుపరుల కోసమే..
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగానే ఈ రోడ్‌షోలు చేపడుతున్నామని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అన్నారు. ఇన్వెస్టర్లను ఆకట్టుకొనేందుకు, మార్కెట్ పరిస్థితులను అంచనా వేసేందుకూ ఇవి ఉపయోగపడుతాయని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఫైనాన్షియల్ హబ్స్‌గా ఉన్న ముంబై, సింగపూర్, హాంకాంగ్, లండన్, బోస్టన్, న్యూయార్క్‌ల్లో ఇప్పటిదాకా రోడ్‌షోలు నిర్వహించామని యునెస్కో గ్లోబల్ జియోపార్క్స్ అండ్ జియోపార్క్స్ ఇన్ ఇండియాపై జరిగిన శిక్షణ-వర్క్‌షాప్ కార్యక్రమానికి హాజరైన ఆయన తెలిపారు. అయితే ఎప్పట్లోగా, ఎంత? వాటాను అమ్ముతారన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ముందు ఈ రోడ్‌షోలు పూర్తవనివ్వండి.. ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. ఇందుకోసం ఓ కమిటీ ఉందని కూడా చెప్పారు.
లాభాల్లో ఉన్నా..
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణే లక్ష్యంగా ముందుకెళ్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. లాభనష్టాలతో సంబంధం లేకుండా అన్నింటినీ అమ్మేయాలనే చూస్తున్నది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో హిందుస్థాన్ జింక్ నికర లాభం గతంతో పోల్చితే 19.4 శాతం పెరిగింది. రూ.2,345 కోట్లుగా ఉన్నది. ఆదాయం కూడా రూ.7,564 కోట్ల నుంచి రూ.8,398 కోట్లకు పెరిగింది. అయినప్పటికీ మిగులు వాటాలను వదిలించుకోవడానికే పెద్దపీట వేస్తుండటం గమనార్హం. ఇక గతంలో ప్రతిపాదించిన మూడు వర్టికల్స్‌కు బదులుగా రెండు వర్టికల్స్లోకే కంపెనీని విభజించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వంతో తాజాగా చర్చలు జరిపినట్టు సంస్థ సీఈవో అరుణ్ మిశ్రా తెలిపారు. హిందుస్థాన్ జింక్‌ను వేర్వేరు సంస్థలుగా విభజించాలన్న పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆపేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా సంప్రదింపులు సానుకూలంగా జరిగినట్టు మిశ్రా చెప్తున్నారు. సంస్థలో మెజారిటీ వాటా వేదాంతదే అయినప్పటికీ వ్యాపార కార్యకలాపాల పునర్నిర్మాణానికి తమ ఆమోదం ఉండాలంటూ గనుల మంత్రిత్వ శాఖ హుకుం జారీ చేసింది. అందుకే కేంద్రంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. కాగా, హిందుస్థాన్ జింక్‌లో మిగులు వాటాను ఓపెన్ మార్కెట్లో ఉపసంహరించుకోవచ్చని 2021లో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది. దీంతో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా వాటాల అమ్మకానికి ప్రయత్నిస్తున్నట్టు కేంద్రం గతంలోనే ప్రకటించింది. దానికి అనుగుణంగా ఇప్పుడు అడుగులు వేస్తున్నది.