హైదరాబాద్, జూలై 3 : మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్(మెయిల్) దూకుడు పెంచింది. వచ్చే మూడేండ్లకాలం లో రూ.40 వేల కోట్ల పెట్టుబడితోపాటు ఐదేండ్లకాలంలో రూ.2 లక్షల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్టు కంపెనీ ఎండీ పీవీ కృష్ణా రెడ్డి తెలిపారు. తన అనుబంధ సంస్థలైన ఈవెయ్ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు డిఫెన్స్ వర్టికల్ అండ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.60 వేల కోట్ల ఆదాయం ఆర్జించిన సంస్థ..ఈ ఏడాది రూ.80 వేల కోట్లు రావచ్చునని అంచనావేస్తున్నది.
ఈ నూతన పెట్టుబడులను ఇన్నోవేషన్ టెక్నాలజీ, సెల్ అండ్ బ్యాటరీ తయారీ, ఫిజికల్ ఇంటెలిజెన్స్ విభాగాలను మరింత బలోపేతం చేయడానికి ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. 10 వేల యూనిట్ల ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పినట్టు, ప్రస్తుతం ఈ యూనిట్లో 4 వేల బస్సులను ఉత్పత్తి చేస్తున్నట్టు, ఆర్డర్లు మాత్రం 8-10 వేల వరకు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు, ఇందుకోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం గ్రూపులో 40 వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మూడు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.