తెలంగాణలో సిటీ గ్యాస్ లైసెన్స్‌లు
న్యూఢిల్లీ, జనవరి 28: తెలంగాణ రాష్ట్రంలో 2 భౌగోళిక ప్రాంతాలకు (జీఏలు) జరిగిన తాజా సిటీ గ్యాస్ బిడ్డింగ్ రౌండ్లో మెఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రా లిమిటెడ్ (మెయిల్), మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ లిమిటెడ్‌లు చెరో జీఏకు, దాదాపు చెరిసగం జిల్లాలకు లైసెన్స్‌ల్ని పొందాయి. ఇండ్లకు పైపుల ద్వారా వంటగ్యాస్, ఆటోమొబైల్స్‌కు రిటైల్ సీఎన్జీ సరఫరా చేసేందుకు వివిధ రాష్ర్టాల్లోని 52 జీఏలకు వచ్చిన బిడ్స్ నుంచి విజయవంతమైన బిడ్డర్లను ఆయిల్ రెగ్యులేటర్ పెట్రోలియం నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (పీఎన్జీఆర్బీ) ఎంపికచేసింది. తెలంగాణలో 2 భౌగోళిక ప్రాంతాలకు జరిగిన బిడ్డింగ్‌లో ఆరు జిల్లాల లైసెన్స్‌ను హైదరాబాదీ సంస్థ మెయిల్ దక్కించుకుంది. ఏడు జిల్లాలను గెయిల్, బీపీసీఎల్ మధ్య జాయింట్ వెంచర్ కంపెనీ అయిన మహారాష్ట్ర నేచురల్ గ్యాస్ గెలుచుకుంది. జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, యాదగిరి జిల్లాలతో కూడిన భౌగోళిక ప్రాంతానికి సిటి గ్యాస్ బిడ్‌ను మెఘా ఇంజనీరింగ్ గెలుచుకుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం, అసీఫాబాద్, కామారెడ్డి జిల్లాలతో కూడిన భౌగోళిక ప్రాంతానికి లైసెన్సు మహారాష్ట్ర నేచురల్ గ్యాస్‌కు లభించింది.
మెఘాకు మొత్తం 13 జీఏలు..
మెఘాకు దేశంలో మొత్తం 13 భౌగోళిక ప్రాంతాల్లో సిటీ గ్యాస్ లైసెన్సులు దక్కాయి. ఇందులో తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర రాష్ర్టాల్లోని భౌగోళిక ప్రాంతాలున్నాయి. 11వ సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్సింగ్ రౌండ్లో మొత్తం 65 జీఏలకు బిడ్స్ ఆహ్వానించగా, 61 జీఏలకు బిడ్స్ అందాయి. అయితే శుక్రవారం 52 జీఏల ఫలితాల్ని మాత్రమే ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ల్లో అసెంబ్లీ ఎన్నికల కారణంగా 9 జీఏల ఫలితాల్ని నిలిపిఉంచారు.