న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశీయ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) వినియోగదారులకు ఆయా ప్లాన్లు ప్రియం కానున్నాయి. ప్రస్తుతమున్న మొబైల్ టారిఫ్‌లలో స్వల్ప మార్పుల్ని కంపెనీ చేయబోతున్నది. అయినప్పటికీ అన్ని ప్లాన్ల ధరల్ని పెంచే యోచనైతే ఇంకా ఏదీ లేదని వొడాఐడియా సీఈవో అభిజిత్ కిశోర్ తెలిపారు. ఇటీవలే భారతీ ఎయిర్టెల్ తమ ప్రీపెయిడ్ మొబైల్ రిచార్జ్ ప్లాన్ల ధరల్ని దాదాపు 4-5 శాతం పెంచిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఇక్కడ సీవోఏఐ డిజీకామ్ సదస్సు 2026 సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ.. ‘స్వల్పంగా టారిఫ్‌లు మారుతున్నాయి. కానీ సాధారణంగా మీరు ఎప్పుడూ చూసే రీతిలో మాత్రం నిర్మాణాత్మక పెంపులుండవు’ అని కస్టమర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల వల్లే ఈ సవరణలని స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది ప్రథమార్ధంలో టెలికాం సంస్థలు టారిఫ్‌లను సుమారు 15 శాతం పెంచవచ్చన్న అభిప్రాయాలను ఇండస్ట్రీ విశ్లేషకులు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
దీంతో త్వరలోనే మిగతా సంస్థలూ చార్జీల పెంపు దిశగా వెళ్తాయా? అన్న అంచనాలు మార్కెట్లో నెలకొన్నాయి. ఇదిలావుంటే వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సంస్థపై కేంద్రం నమ్మకంతో ఉన్నదని, దాన్ని నిలబెట్టుకునేలా పనితీరును మెరుగుపర్చడంపైనే దృష్టిపెట్టామని కిశోర్ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో తమ సబ్‌స్ర్కైబర్లు పెరిగిన విషయాన్ని గుర్తుచేశారు. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన ఇటీవలి నివేదిక ప్రకారం గత నెల వొడాఫోన్ ఐడియా మొబైల్ వినియోగదారులు లక్షకుపైగా పెరిగారని తేలింది.