Maruti Suzuki | కొవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి.. యావత్ కుటుంబ సభ్యులంతా ప్రయాణించే వీలు ఉన్న ఎస్యూవీ మోడల్ కార్లకు డిమాండ్ పెరిగింది. మొత్తం మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్ కార్లు కీలకం. అందుకే ఎస్యూవీ విభాగంలో పట్టు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న మారుతి సుజుకి.. మిడ్-ఎస్యూవీ సెగ్మెంట్‌పై ఫోకస్ చేస్తున్నది.
ఇప్పటి వరకు మిడ్-ఎస్యూవీ సెగ్మెంట్లోకి మారుతి ఎంట్రీ కాలేదు. ఈ నెలాఖరులోగా మిడ్-ఎస్యూవీ కారును ఆవిష్కరిస్తామని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాత్సవ చెప్పారు. ఈ క్యాటగిరీలో డీజిల్ వినియోగ కార్ల విక్రయం తగ్గించేసి, ఫ్యూయల్ సామర్థ్యంతో కూడిన పెట్రోల్ వర్షన్ కార్లను తీసుకొస్తామన్నారు. దీంతోపాటు సబ్-ఫోర్ మీటర్స్ ఎస్యూవీ సెగ్మెంట్ వైపు దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
మొత్తం దేశంలోని కార్ల మార్కెట్లో మారుతి సుజుకి వాటా 45 శాతంగా ఉంది. దీన్ని 50 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎస్యూవీ సెగ్మెంట్‌తో పోలిస్తే నాన్-ఎస్యూవీ సెగ్మెంట్ కార్ల సేల్స్ 65 శాతానికి పైగా కార్లు విక్రయిస్తున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు. మారుతి సుజుకి ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్లో కార్ల విక్రయం వాటా 20 శాతం. ఏటా 6.6 లక్షల ఎంట్రీ లెవల్ కార్లు అమ్ముడవుతున్నాయి. మిడ్-ఎస్యూవీ సెగ్మెంట్లో 5.5 లక్షల కార్లు అమ్ముడైతే మారుతి సుజుకికి ఎటువంటి కార్లు లేవు.