Maruti Suzuki Swift- Used Cars | కరోనా మహమ్మారి తర్వాత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్నారు. వెసులుబాటు ఉన్నవారు కొత్త కార్లు కొనుగోలు చేస్తే, ఆ అవకాశం లేని వారు యూజ్డ్ కార్లు సొంతం చేసుకుంటున్నారు. 2024 యూజ్డ్ కార్ల (Used Cars) విక్రయాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) మొదటి స్థానంలో నిలిచింది. దేశంలోని మెట్రో పాలిటన్ నగరాలు, నాన్ మెట్రో నగరాల పరిధిలో అత్యధికంగా ‘స్విఫ్ట్ (Swift)’ కారుకు డిమాండ్ ఎక్కువగా ఉందని కార్స్24ఎస్ ‘గేర్ ఆఫ్ గ్రోత్: 2024 ఇండియన్ యూజ్డ్ కార్ల మార్కెట్ నివేదిక’పేర్కొంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ (Maruti Suzuki Swift) తర్వాత హ్యుండాయ్ శాంట్రో (Hyundai Santro), టాటా టియాగో ఎన్ఆర్జీ (Tata Tiago NRG), మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ (Maruti Suzuki Wagon-R) తదితర యూజ్డ్ కార్లకు గిరాకీ బాగానే ఉంది. 2023లో 46 లక్షల యూనిట్లు అమ్ముడైన యూజ్డ్ కార్ల మార్కెట్ 2030కల్లా 10.8 మిలియన్ యూనిట్లకు చేరుతుంది.
యూజ్డ్ కార్ల మార్కెట్లో 2024లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ టాప్లో నిలిచాయి. 2023తో పోలిస్తే గతేడాది కార్ల సేల్స్ ఐదు రెట్లు పెరిగాయి. 2023లో మాదిరిగానే 2024లోనూ యూజ్డ్ ఎస్యూవీ కార్లు గణనీయంగానే అమ్ముడయ్యాయి. గతేడాది మొత్తం యూజ్డ్ కార్ల విక్రయంలో ఎస్యూవీల వాటా 16.7 శాతంగా ఉంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోనూ యూజ్డ్ ఎస్యూవీ కార్లు ఫేవరెట్లుగానే ఉన్నాయి. యూజ్డ్ కార్ల విక్రయాల్లో మహారాష్ట్ర 16.4శాతం, ఉత్తరప్రదేశ్ 11.7శాతం, ఢిల్లీ 13.8 శాతం వాటా కలిగి ఉన్నాయి.
కొత్త కార్ల విక్రయాలు, యూజ్డ్ కార్ల విక్రయాలకు మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. సగటున కొత్త కార్ల విక్రయాలు 32శాతం వృద్ధి చెందితే, యూజ్డ్ కార్ల సేల్స్ 24 శాతంగా ఉన్నాయి. ధరలు పెరుగుతున్నా, కొనుగోలుదారులు తమ బడ్జెట్లోనే యూజ్డ్ కార్లు సొంతం చేసుకుంటున్నా క్వాలిటీతో రాజీ పడటం లేదని ఆ నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి తర్వాత షేర్డ్ ట్రాన్స్పోర్ట్తో పోలిస్తే సేఫ్టీ, సౌకర్యం కోసం పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్న వారు 12 శాతం మంది ఉంటారని ఆ నివేదిక సారాంశం.