Maruti Eeco | అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మంగళవారం న్యూ ఎకో ( new Eeco ) వ్యాన్‌ను ఆవిష్కరించింది. 5-సీటర్, 7-సీటర్, కార్గో, టూర్, అంబులెన్స్‌తోపాటు 13 వేరియంట్లలో ఈ వ్యాన్ లభ్యం అవుతుంది. దీని ధర రూ.5.10 లక్షల నుంచి రూ.8.13 లక్షల వరకు పలుకుతోంది. న్యూ ఎకో వ్యాన్ 1.2 లీటర్ల కే-సిరీస్ డ్యుయల్ జెట్, డ్యూయల్ వీవీటీ ఇంజిన్‌తో వస్తున్నదీ వ్యాన్. తాజాగా మార్కెట్లో ఉన్న కార్లలో పెట్రోల్ వేరియంట్ కార్లు 6000 ఆర్పీఎం వద్ద 59.4 కిలోవాట్ల (80.76 పీఎస్), 3000 ఆర్పీఎం వద్ద 104.4 ఎన్ఎం టార్చి వెలువరించే సామర్థ్యం కలిగి ఉంది. వీటిపై న్యూ ఎకో వ్యాన్‌లో 10 శాతం అదనపు పవర్ కెపాసిటీ ఉంటుంది.
న్యూ ఎకో పెట్రోల్ వర్షన్ కారు లీటర్‌పై 20.20 కి.మీ (25 శాతం అదనంగా ఫ్యుయల్ ఎఫిషియెంట్) మైలేజీ, ఎస్-సీఎన్జీ వేరియంట్ 29 శాతం అధిక ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కలిగి ఉంటుంది. లీటర్ పెట్రోల్‌పై 27.05 కి.మీ. మైలేజీ ఇస్తుంది.
డ్రైవర్ ఫోకస్డ్ కంట్రోల్స్, రిక్లైనింగ్ ఫ్రంట్ సీట్స్, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్ (ఏసీ వేరియంట్స), డోమ్ ల్యాంప్ విత్ న్యూ బ్యాటరీ సేవర్ ఫంక్షన్ వంటి ఫీచర్లు జత కలిశాయి. డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, చైల్డ్ లాక్ ఫర్ స్లైడింగ్ డోర్స్ అండ్ విండోస్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఇల్యూమినేటెడ్ హజార్డ్ స్విచ్ వంటి 11కు పైగా సేఫ్టీ ఫీచర్లతో న్యూ ఎకో వ్యాన్ వస్తున్నది.
ఇంకా మెటాలిక్ బ్రిస్క్ బ్లూ బాడీ కలర్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, న్యూ స్టీరింగ్ వీల్, రోటరీ కంట్రోల్స్ ఫర్ ఏసీ అండ్ హీటర్ వంటి ఫీచర్లు కూడా వస్తాయి. ఎకో వ్యాన్ తొలుత భారత రోడ్లపైకి 2010లోకి దూసుకొచ్చింది. మార్కెట్లోకి వచ్చిన రెండేండ్లలోనే లక్షకు పైగా వ్యాన్లు అమ్ముడయ్యాయి. 2018లో తొలి ఐదు లక్షల వ్యాన్లను విక్రయించింది మారుతి. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-10 సెల్లింగ్ కార్లలో ఇది ఒకటి.