న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతీ సుజుకీ.. ఎలక్ట్రిక్ వెహికిల్ (ఈవీ) మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నది. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆధారిత వాహన మార్కెట్లో దూసుకుపోతున్న మారుతీ.. విద్యుత్తు ఆధారిత వాహన మార్కెట్లో మాత్రం వెనుకబడిపోయింది. దాదాపుగా అన్ని సంస్థలు ఈవీ సెగ్మెంట్‌పై ఇప్పుడు గట్టిగానే ఫోకస్ చేస్తున్నాయి మరి. ఈ క్రమంలో మారుతీ సైతం వచ్చే ఏడాది జనవరిలో తమ తొలి ఈవీ మాడల్‌ను మార్కెట్‌కు పరిచయం చేయాలనుకుంటున్నది. సింగిల్ చార్జింగ్‌తో 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణించేలా ఓ మధ్య శ్రేణి ఎస్‌యూవీని తీసుకురాబోతున్నది. ఈ మేరకు మంగళవారం ఇక్కడ జరిగిన 64వ సియామ్ వార్షిక సమావేశానికి హాజరైన మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) పార్థో బెనర్జీ విలేకరులకు తెలిపారు. అయితే ధర ఎంత? అన్న వివరాలు మాత్రం తెలియజేయలేదు.
ఇన్ఫ్రాపై గురి
ఈవీ మార్కెట్లోకి ప్రవేశించే ముందు వాహనదారుల సౌకర్యార్థం పటిష్టమైన మౌలిక సదుపాయాల వ్యవస్థను ఏర్పర్చాలని మారుతీ సుజుకీ భావిస్తున్నది. అందుకే ఈవీల చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నట్టు బెనర్జీ వెల్లడించారు. అలాగే తమ ఈవీ కార్లను కొన్నవారు ఐదేండ్ల తర్వాత అమ్ముకున్నా తగిన రేటు పలికేలా కృషి చేస్తున్నట్టు వివరించారు. ఆటో మార్కెట్లో రీసేల్ వాల్యూ కూడా ముఖ్యమేనన్నారు. ‘మేము కేవలం ఈవీలనే మార్కెట్‌కు పరిచయం చేయాలనుకోవడం లేదు. కస్టమర్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలనూ కల్పించాలనుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే 2030కల్లా ఎగుమతుల్ని మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సియామ్ సమావేశంలో మాట్లాడుతూ సంస్థ ఎండీ, సీఈవో హిసాషి తెలిపారు.
పండుగ సీజన్లో ఆఫర్లు?
గతకొద్ది నెలలుగా మార్కెట్లో నెలకొన్న మందగమనంతో ఆటో అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. డిమాండ్ లేక వాహనాలు పెద్ద ఎత్తున డీలర్ల దగ్గరే ఉండిపోతున్నాయి. దీంతో వాహన తయారీ సంస్థలు సైతం ఎక్కువగా సరఫరా చేయడం లేదు. ఈ నేపథ్యంలో రాబోయే పండుగ సీజన్‌పై అన్ని కంపెనీలు భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా డీలర్ల వద్ద మిగిలిపోయిన వాహన నిల్వలన్నీ తరిగిపోయేలా, కొనుగోలుదారులను ఆకర్షించేలా ఆయా మాడల్స్పై ఆఫర్లను తేవాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నామని బెనర్జీ తెలియజేశారు. దీంతో ఈ పండుగ సీజన్లో కార్ల ధరలు తగ్గవచ్చన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఏటా దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్లతో రాబోయే 3-4 నెలలు ఆటో మార్కెట్లో సందడి నెలకొంటుంది. దీన్ని ఒడిసి పట్టుకొని బిజినెస్‌ను పెంచుకోవాలని అంతా సహజంగానే ప్రయత్నిస్తూంటారు.