Maruti Suzuki | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ( Maruti Suzuki ) మరో రికార్డు సొంతం చేసుకుంది. దేశంలో కార్ల ఉత్పత్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 2.5 కోట్ల కార్లను ఉత్పత్తి చేసినట్లు బుధవారం తెలిపింది. 1983 డిసెంబర్ నుంచి హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ప్రొడక్షన్ ప్రారంభించిన పుష్కర కాలానికి అంటే 1994 మార్చి నాటికి పది లక్షల కార్లు తయారు చేసింది.
2011 మార్చిలో కోటి, 2018 జూలైలో 2 కోట్ల కార్ల ఉత్పత్తి లక్ష్యాన్ని మారుతి సుజుకి అధిగమించింది. హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో తొలి ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించిన మారుతి సుజుకి.. ఇప్పుడు గురుగ్రామ్, మనేసార్ యూనిట్ల నుంచి ఏటా 15 లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచుకున్నది.
సుమారు 100 దేశాలకు కార్లను ఎగుమతి చేస్తున్నది మారుతి సుజుకి. దేశీయ మార్కెట్లో 16 మోడల్స్ కార్లను విక్రయిస్తున్నది. ‘భారతీయులతో 40 ఏండ్ల భాగస్వామ్యానికి 2022 గుర్తుగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. 2.5 కోట్ల కార్ల ఉత్పత్తి.. భారతీయులతో భాగస్వామ్యం, వారి పట్ల తమకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం’ అని మారుతి సుజుకి మేనేజింగ్ డైరెక్టర్ కం సీఈవో హిషాచీ తకైచీ పేర్కొన్నారు.
ఇక ముందు మార్కెట్లోకి కొత్త మోడల్ కార్లను ప్రవేశపెడతామని హిషాచీ తకైజీ తెలిపారు. కస్టమర్ల నుంచి తమ కార్లకు ఇదే స్థాయిలో మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా హర్యానాలోని ఖార్ఖోడాలో కొత్త మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.