మంగళవారం 31 మార్చి 2020
Business - Jan 29, 2020 , 00:42:03

మారుతి లాభం రూ.1,587 కోట్లు

మారుతి లాభం రూ.1,587 కోట్లు
  • క్యూ3లో 4 శాతం పెరుగుదల
  • కలిసొచ్చిన కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, వ్యయ నియంత్రణ చర్యలు

న్యూఢిల్లీ, జనవరి 28: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకి ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) మూడో త్రైమాసికం (అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ.1,587.4 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే త్రైమాసికంలో రూ.1,524.5 కోట్లుగా ఉన్నది. దీంతో ఈసారి 4.13 శాతం పెరిగినైట్లెంది. ఏకీకృత ఆదాయం ఈసారి రూ. 20,721.8 కోట్లుగా ఉంటే, పోయినసారి రూ.19,680.7 కోట్లుగా ఉందని మంగళవారం సంస్థ తెలియజేసింది. 5.29 శాతం పెరిగినట్లు పేర్కొన్నది. తగ్గిన కార్పొరేట్‌ పన్ను రేటు, వ్యయ నియంత్రణ చర్యలు, దిగొచ్చిన వస్తూత్పత్తి ధరలు కలిసొచ్చాయని వివరించింది. 


అమ్మకాలు 2 శాతం పెరిగి 4,37,361 యూనిట్లకు చేరాయి. దేశీయ మార్కెట్‌లో ఇవి 4,13,698 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతులు 23,663 యూనిట్లుగా ఉన్నట్లు మారుతి సుజుకి ఇండియా తెలియజేసింది. గతేడాది ఏప్రిల్‌-డిసెంబర్‌లో సంస్థ ఏకీకృత నికర లాభం రూ.4,355.3 కోట్లుగా ఉన్నది. అంతకుముందు ఏడాది ఏప్రిల్‌-డిసెంబర్‌లో రూ.5,819.8 కోట్లుగా ఉన్నది. 25.16 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం కూడా 11.06 శాతం పడిపోయి రూ.64,594.5 కోట్ల నుంచి రూ.57,452.3 కోట్లకు చేరింది. 2019 ఏప్రిల్‌-డిసెంబర్‌లో స్థూలంగా 11 లక్షల 78,272 యూనిట్ల వాహనాలు అమ్ముడైయ్యాయి. 2018 ఏప్రిల్‌-డిసెంబర్‌తో పోల్చితే 16.1 శాతం తక్కువ. దేశీయ మార్కెట్‌లో విక్రయాలు 11 లక్షల 698 యూనిట్లుగా ఉండగా, ఇవి గతంతో పోల్చితే 16.9 శాతం తక్కువ. ఎగుమతులు 77,574 యూనిట్లుగా ఉన్నట్లు సంస్థ తెలిపింది.


logo
>>>>>>