Maruti Cars Recall | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి 11,177 కార్లను రీకాల్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. గ్రాండ్ విటారా కార్లలో రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్స్ సమస్య తలెత్తినట్లు తెలిపింది. గత ఏడాది ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి నవంబర్ 15 వరకు తయారైన గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది.
రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్లలో సమస్య తలెత్తింది. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు రేర్ సీట్ బెల్ట్ లూజ్ అయ్యే అవకాశం ఉందని, దానివల్ల పనితీరు దెబ్బ తింటుందని మారుతి తెలిపింది. గత ఆగస్టు – నవంబర్ మధ్య తయారైన గ్రాండ్ విటారా కార్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు తమ డీలర్ల ద్వారా సమాచారం అందుతుందని తెలిపింది. వాటిని తనిఖీ చేసి, దెబ్బ తిన్న విడి భాగాలను ఉచితంగా రీ ప్లేస్ చేస్తామని వెల్లడించింది.
ఇంతకుముందు మారుతి సుజుకి ఎయిర్‌బ్యాగ్ డిఫెక్ట్ కారణంగా వివిధ మోడళ్లకు చెందిన 17,362 కార్లు రీకాల్ చేసింది. వాటిలో ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజా, బాలెనో, గ్రాండ్ విటారా మోడల్ కార్లు ఉన్నాయి. గత నెల 8 నుంచి ఈ నెల 12 వరకు తయారైన కార్లలో ఈ ఎయిర్‌బ్యాగ్ డిఫెక్ట్ తలెత్తితే ఉచితంగా రీప్లేస్ చేస్తామని మారుతి తెలిపింది.