Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. జీఎస్టీ శ్లాబ్‌లను మారుతూ జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ నాలుగు శ్లాబ్‌ల స్థానంలో ఇకపై రెండు మాత్రమే ఉండనున్నాయి. ఈ నెల 22 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 12శాతం, 28శాతం శ్లాబ్‌లను జీఎస్టీ కౌన్సిల్ తొలగించింది. ఈ క్రమంలో ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలు, జీఎస్టీ సంస్కరణలతో మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో భారీగా అమ్మకాలు జరగడంతో మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో పోలిస్తే సెన్సెక్స్ 81,456.67 పాయింట్ల లాభాల్లో మొదలైంది.
ఇంట్రాడేలో 81,456.67 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. 80,608.94 పాయింట్ల కనిష్టానికి చేరింది. చివరకు 150.30 పాయింట్ల లాభంతో 80,718.01 వద్ద ముగిసింది. నిఫ్టీ 19.25 పాయింట్లు పెరిగి 24,734.30 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.6 శాతం పతనమయ్యాయి. నిఫ్టీలో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, అపోలో హాస్పిటల్స్, నెస్లే లాభాల్లో కొనసాగగా.. హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా కన్స్యూమర్, విప్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి. ఆటో ఇండెక్స్ దాదాపు 1శాతం, ఎఫ్‌సీఎంజీ ఇండెక్స్ 0.3 శాతం, ఐటీ, మీడియా, మెటల్, ఆయిల్, గ్యాస్, రియాల్టీ, పవర్, పీఎస్‌యూ బ్యాంక్ 0.5 నుంచి ఒకశాతం వరకు పతనమయ్యాయి.
బ్రిటానియా, బాటా ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్ జీఎస్టీ పన్ను కోతల తర్వాత ఒకటి నుంచి ఆరుశాతం వరకు పెరిగాయి. జీఎస్టీ 12శాతం నుంచి 5శాతానికి తగ్గింపుతో బికాజీ, ప్రతాప్ స్నాక్స్ షేర్లు 3శాతం పెరిగాయి. పన్నును 28 శాతం నుంచి 40 శాతానికి పెంచడంతో డెల్టా కార్ప్ షేర్లు 8శాతం పడిపోయాయి. బీఎస్ఇలో దాదాపు 140 స్టాక్‌లు 52 వారాల గరిష్టానికి చేరాయి. ఎం అండ్ ఎం, జైడస్ వెల్నెస్, మహారాష్ట్ర స్కూటర్స్, ముత్తూట్ ఫైనాన్స్, నువోకో విస్టాస్, కమ్మిన్స్ ఇండియా, ఐషర్ మోటార్స్, నైకా, టీవీఎస్ మోటార్, లెమన్ ట్రీ హోటల్స్, మారికో, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, దాల్మియా భారత్, ఎంఆర్ఎఫ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, మారుతి సుజుకి, పేటీఎం ఉన్నాయి. యుఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి 14 పైసలు తగ్గి 88.16 వద్ద ముగిసింది.