Manmohan Singh – Raghuram Rajan | భారత్ అభివృద్ధికి గల అవకాశాలపై దార్శనికత గల ఆర్థిక వేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఎయిమ్స్ లో కన్నుమూశారు. మృదు స్వభావి కావడంతోపాటు చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తిగా మాంటెక్ సింగ్ అహ్లువాలియా, రంగరాజన్, రాకేష్ మోహన్ వంటి ప్రతిభావంతులను తన బృందంలోకి తీసుకున్నారని గుర్తు చేశారు.
రాజకీయ సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుని భారత దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన ప్రతిభావంతుడైన ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అని శుక్రవారం రఘురామ్ రాజన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. అంతకు ముందు ప్రధాని పీవీ నర్సింహారావు మద్దతుతో ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి పునాదులు వేశారని కొనియాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏనాడు తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన పదవిని వాడుకోలేదని, సమగ్రతకు మారుపేరుగా నిలిచారన్నారు. తాను సలహాలు అడిగితే తప్ప, గతంలో ఆయన ఆర్బీఐ గవర్నర్గా పని చేసినా తనకు ఎటువంటి సలహాలు ఇచ్చేవారు కాదన్నారు.