న్యూఢిల్లీ : ఆర్డర్ల డెలివరీల విషయంలో ఈ-కామర్స్ దిగ్గజాలు కస్టమర్లకు చుక్కలు చూపుతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్ధలపై ఓ వస్తువుకు ఆర్డర్ చేస్తే మరో వస్తువు పంపడం వంటి నిర్వాకాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ రెడిట్ యూజర్ అమెజాన్‌లో రూ. 1,32,000 విలువైన ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌కు ఆర్డర్ చేయగా దాని బదులు ఫేక్ ఐఫోన్ రావడంతో కంగుతిన్నాడు. ఆన్లైన్లో ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ వంటి ఖరీదైన ఫోన్లను కొనుగోలు చేయడం ప్రమాదకరమని రెడిట్ యూజర్ అక్షయ్తుంగ తనకు ఎదురైన అనుభవాన్ని ఇతరులతో పంచుకున్నాడు.
పలు ఆకర్షణీయ డీల్స్, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నా కొందరు ఆన్లైన్లో కొనుగోలు చేసే వస్తువుల కచ్చితత్వంపై అనుమానంతో ఇప్పటికీ రిటైల్ స్టోర్స్‌లో కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు. తాను అమెజాన్‌లో ఐఫోన్ 14 మ్యాక్స్‌కు ఆర్డర్ ఇవ్వగా ఫేక్ ఐఫోన్ వచ్చిందని అక్షయతుంగ రెడిట్‌లో పోస్ట్ చేశారు. యాపిల్ స్టోర్‌లో ఐఫోన్‌ను కొనుగోలు చేయకుండా అమెజాన్ నుంచి ఆర్డర్ చేయడం పొరపాటైందని వాపోయారు.
అమెజాన్‌లో ఫోన్‌ను రిసీవ్ చేసుకోగానే అది ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌ను పోలిన నకిలీ ఫోన్‌గా గుర్తించానని చెప్పారు. ఫోన్లో పలు లోపాలను గుర్తించానని, ఫ్రంట్ కెమరాలో పోర్ట్రయిట్ మోడ్ లేదని, ఫోన్ ఓపెన్ చేయగానే సెటప్ గురించి అడగలేదని, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి యాప్స్ ముందుగానే ఇన్స్టాల్ అవడం చూసి ఆశ్చర్యపోయానని గుర్తుచేసుకున్నారు.
ఆపై చెక్కవరేజ్.యాపిల్.కాంలో ఫోన్ సీరియల్ నెంబర్ చెక్ చేసుకున్నానని అక్షయ్ చెప్పుకొచ్చారు. అక్షయ్ యాపిల్ అధీకృత సెల్లర్ ఆప్ట్రానిక్స్ను సందర్శించి ఫిర్యాదు చేశారు. తాను ఇండియన్ మోడల్‌ను ఆర్డర్ చేయగా యూఎస్ పీస్ పంపారని సర్వీస్ సెంటర్ ప్రతినిధి తెలిపారని అక్షయ్ వివరించారు. అమెజాన్ ప్రతినిధులు రీప్లేస్మెంట్ చేసే ప్రక్రియ చేపట్టారని తెలిపారు. ఖరీదైన వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేసే క్రమంలో అప్రమత్తంగా ఉండాలని, అధీకృత స్టోర్లు, అధికారిక అవుట్లెట్లలోనే వీటిని కొనుగోలు చేయాలని అక్షయ్ ఉదంతం వెల్లడిస్తోంది.