న్యూఢిల్లీ, ఆగస్టు 18 : ‘మేక్ ఇన్ ఇండియా’.. ‘మేక్ ఆల్ దట్ ఇండియా నీడ్స్’గా రూపాంతరం చెందవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. భారతీయ అవసరాలన్నీ ఇక్కడే తీరేలా ఉంటే.. దేశంలోకి విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయని, ఉత్పత్తి సైతం ప్రభావితం కాగలదని హెచ్చరించారు. సోమవారం పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మన అవసరాలన్నీ మనమే, ఇక్కడే తీర్చుకుంటే.. చైనా వంటి దేశాల నుంచి విదేశీ సంస్థల్ని ఆకర్షించి, వారి పెట్టుబడుల్ని ఒడిసి పట్టుకునే అవకాశాన్ని చేజార్చుకుంటామని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే ‘మేక్ ఇన్ ఇండియా’ విజయం పోటీతత్వంపై ఆధారపడి ఉండాలేగానీ, రక్షణాత్మక కోణంలో ఉండరాదని హితవు పలికారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆకాంక్ష.. రక్షణ, ఇంధన తదితర కీలక రంగాల్లో వ్యూహాత్మకంగా నిలదొక్కుకునేలా ఉంటే మంచిదేగానీ, అన్ని రంగాలకు దాన్ని ఆపాదించుకుంటే మాత్రం నష్టపోతామని వ్యాఖ్యానించడం గమనార్హం. అందుకే ‘మేక్ ఇన్ ఇండియా’ భారతీయ అవసరాలను తీర్చుకోవడానికేగాక, ప్రపంచ అవసరాల కోసం కూడా అన్నట్టుగా ఉండాలని పేర్కొన్నారు.
భారతీయ ఎగుమతులకు అతిపెద్ద మార్కెట్‌గా అమెరికానే ఉందన్నారు దువ్వూరి. మొత్తం దేశీయ ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 20 శాతంగా ఉంటుందన్న ఆయన.. దేశ జీడీపీలో ఇది 2 శాతానికి సమానమని గుర్తుచేశారు. కాబట్టి ఔషధ, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు సుంకాల మినహాయింపున్నా.. అది శాశ్వతం కాదని, తాత్కాలికమేనన్నారు. అందుకే 50 శాతం టారిఫ్‌లు సుమారు సగం దేశ ఎగుమతులను ప్రభావతం చేసే వీలు లేకపోలేదని విశ్లేషించారు. ముఖ్యంగా ఎక్కువమందికి జీవనోపాధిని కల్పిస్తున్న టెక్స్టైల్స్, రత్నాలు-ఆభరణాలు, తోలు తదితర రంగాలకు ట్రంప్ టారిఫ్‌లు ఇబ్బందేనన్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ వస్తూత్పత్తులకు పోటీగా ఉన్న బంగ్లాదేశ్, వియత్నాంలపై అమెరికా సుంకాలు 20 శాతంగా, ఇండోనేషియాపై 19 శాతంగానే ఉన్నాయి. ఏదిఏమైనా 2030 నాటికి భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు వెళ్లాలన్న కల.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కలగానే మిగిలిపోయేలా ఉన్నదన్న అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
భారత్ తమ ప్రయోజనాలను ఎవరి కోసం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదన్న దువ్వూరి.. విస్తృత వాణిజ్య ప్రయోజనాల కోసం ఆచరణీయమైన రాజీలకు అంగీకరిస్తే పెద్దగా నష్టమేమీ లేదని అన్నారు. నిజానికి అమెరికా డిమాండ్ చేస్తున్నట్టుగా రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల్ని ఆపేసి, గల్ఫ్ దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భగ్గుమనేవని దువ్వూరి వ్యాఖ్యానించారు. అమెరికా, ఒపెక్ రెండింటికి కూడా వేగంగా భారత్ సహా, ఇతర దేశాల మార్కెట్ అవసరాలకు సరిపడా చమురును సరఫరా చేసే సామర్థ్యం లేదన్నారు. అలాగే భారత్ కరెంట్ ఖాతా లోటు పెరిగిపోవడం, డాలర్‌తో పోల్చితే రూపాయి బలహీనపడటం, ద్రవ్యోల్బణం విజృంభించడం వంటి వాటికి ఆస్కారం ఉండేదన్నారు.