మన దేశంలో మధ్యతరగతి ప్రజానీకమే ఎక్కువ. ప్రతీ విషయంలో సర్దుకుపోయే వైఖరి.. అరకొర సదుపాయాలతో సహజీవనం.. కోరికల్ని చంపుకుంటూ ఆశల పల్లకిలో విహరించే మనస్తత్వం.. ఇవీ ఓ భారతీయ సగటు మధ్యతరగతి మనిషి గురించి చెప్పాలంటే గుర్తుకొచ్చే మాటలు. అయితే మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు మనమూ మారకపోతే మన ఉనికే ప్రశ్నార్థకమయ్యే ప్రమాదమున్నది. అందుకే మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైం దని అంటున్నారు ఆర్థిక నిపుణులు.
మధ్యతరగతి మదుపరులు ఎప్పుడూ సేఫ్ గేమ్‌కే మొగ్గుచూపుతారు. అయితే దీనివల్ల రాబడులకున్న మార్గాలు పరిమితమవుతాయని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. రక్షణాత్మక పెట్టుబడులు, వృద్ధిలేని ఆస్తులతో ఒరిగేదేమీ లేదని హెడ్జ్ ఫండ్ మేనేజర్, ఫిన్‌ఫ్లుయెన్సర్ అక్షత్ శ్రీవాత్సవ మాట. ఈ రకమైన ధోరణితో సంపద నెమ్మదిగా, మనకు తెలియకుండానే కరిగిపోతుందని చెప్తున్నారు. నిజానికి చాలామంది తమ ఆదాయం పెరగగానే సురక్షిత పెట్టుబడి సాధనాలను ఎంచుకుని బ్యాడ్ ఇన్వెస్టింగ్‌కు బీజం వేస్తున్నారన్నది శ్రీవాత్సవ అభిప్రాయం.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు తీవ్ర ఆటుపోట్లకు లోబడి ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులనే అందిస్తాయని మెజారిటీ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో అత్యధిక భాగం పీఎఫ్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఒకటికి మించి ఇండ్ల కొనుగోళ్లు ఇతరత్రా సంప్రదాయ మదుపు మార్గాలకే కేటాయించవద్దని సూచిస్తున్నారు. మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితులనుబట్టి 80 శాతందాకా స్మార్ట్, రిస్క్ ఆధారిత పెట్టుబడులకు ధైర్యం చేయవచ్చని అంటున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా కట్టుదిట్ట
మైన ప్రణాళికలు కావాలి. ఉదాహరణకు సంపన్నులు ట్యాక్స్‌లను ఏ రకంగా పెట్టుబడి
మార్గాలుగా మార్చుకుంటున్నారో పరిశీలించవచ్చు. ఆయా పెట్టుబడులతో పన్ను చెల్లింపులను బాగా తగ్గించేసుకుంటారు. కానీ మధ్యతరగతి వర్గాలు పొదుపును, పెట్టుబడిని విస్మరించి గుడ్డిగా పన్నులను చెల్లిస్తూపోతున్నారు. సరైన ప్రణాళికలుంటే ట్యాక్స్లనూ ఇన్వెస్ట్మెంట్స్ వైపునకు మళ్లించుకోవచ్చన్నది నిపుణుల సలహా. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే విజ యం ఖాయమే. ఇందుకు వెల్త్ మేనేజ్మెంట్, ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్‌ను సంప్రదించడం తెలివైన పని. అనుభవం లేకుండా ముందుకెళ్తే నష్టాలు ఎదురుకావచ్చు మరి.
పిల్లల చదువు, పెండ్లిళ్లు, జీవిత-ఆరోగ్య బీమా, ఆరోగ్య సమస్యలు, రిటైర్మెంట్ అనంతర జీవితం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చక్కని రోడ్‌మ్యాప్‌ను చిన్న వయసులోనే వేసుకుంటే సత్ఫలితాలుంటాయి. ఉద్యోగ జీవితం ప్రారంభమైన దగ్గర్నుంచే పెట్టుబడులకు పెద్దపీట వేయాలి. ఎంత తక్కువ వయసులో బీమాను తీసుకుంటే అంత ఎక్కువ లాభం ఉంటుంది.