Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జోరుగా సాగుతోంది. సిద్ధులు, సన్యాసులు మొదలు వివిధ రంగాల ప్రముఖుల వరకూ ప్రతి ఒక్కరూ ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో కేంద్ర పౌర విమానయానశాఖ అప్రమత్తమైంది. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్న ప్రయాణికుల నుంచి ఇబ్బడిముబ్బడిగా టికెట్ల ధరలు పెంచేసి ఎయిర్‌లైన్స్ సొమ్ము చేసుకుంటున్నాయి.
ఫిబ్రవరి 26 వరకూ మహా కుంభమేళా జరుగనున్న నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే విమాన సర్వీసులు కూడా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల ప్రతినిధులతో పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ గత వారం సమావేశమై అదనపు విమాన సర్వీసులు నడపాలని కోరింది. టికెట్ల ధరలు తగ్గించాలని అభ్యర్థించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం నేరుగా విమాన టికెట్ల ధరలను డీజీసీఏ నియంత్రించలేదు.
ప్రస్తుతం దేశంలోని ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు 132 విమాన సర్వీసులతో నెలవారీగా 80 వేల మంది ప్రయాణికులను తరలిస్తున్నాయి. గతేడాది ఎనిమిది నగరాల నుంచి విమానాలు ప్రయాగ్‌రాజ్‌కు నడిస్తే, ప్రస్తుతం 17 నగరాల నుంచి నేరుగా ప్రయాగ్‌రాజ్‌కు వెళుతున్నాయి. ప్రత్యక్షంగా, కనెక్టింగ్ విమాన సర్వీసులు 26 నగరాలను అనుసంధానించాయి. శ్రీనగర్, విశాఖపట్నం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్ రాజ్‌కు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వచ్చే నెలలో మహా శివరాత్రి నేపథ్యంలో భారీ సంఖ్యలో యాత్రికులు మహా కుంభమేళాకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.