Market Capitalisation | మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలతో గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో తొమ్మిది సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,74, 906.18 కోట్లు కోల్పోయాయి. స్టాక్ మార్కెట్ల లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా నష్టపోయాయి. ఈ నెల రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారంలో బీఎస్ఈ బెంచ్ మార్క్ సెన్సెక్స్ 3,883.4 పాయింట్లు (4.53 శాతం) నష్టంతో ముగిసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,88,479.36 నష్టపోయి రూ.18,76,718.24 లక్షల కోట్లకు చేరుకుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.72,919.58 కోట్లు కోల్పోయి రూ.12,64,267.35 కోట్లకు పరిమితమైంది. భారతీయ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.53,800.31 కోట్లు నష్టపోయి రూ.9,34,104.32 కోట్లకు చేరుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.47,461.13 కోట్ల పతనంతో రూ.8,73,059.59 కోట్లకు పరిమితమైంది.భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.33,490.86 కోట్ల పతనంతో రూ.6,14,125.65 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ. 27,525.46 కోట్లు నష్టంతో రూ. 6,69,363.31 కోట్లకు పరిమితమైంది.
ఐటీసీ ఎం-క్యాప్ రూ.24,139.66 కోట్లు పతనమై రూ. 6,29,695.06 కోట్ల వద్ద ముగిసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ. 21,690.43 కోట్ల నుంచి రూ.15,37,361.57 కోట్లకు పడిపోయింది.భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,399.39 కోట్లు కోల్పోయి రూ.7,10,934.59 కోట్ల వద్ద ముగిసింది.
ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.4,629.64 కోట్ల నుంచి రూ. 7,96,527.08 కోట్లకు పెరిగింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత అత్యంత విలువ గల కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలవగా, తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ, ఎల్ఐసీ నిలిచాయి.