హైదరాబాద్, నవంబర్ 16: హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ రవాణా సర్వీసుల్ని లుఫ్తాన్సా కార్గో పునరుద్ధరించింది. కొవిడ్ సమయంలో ఏడాది క్రితం నిలిచిపోయిన ఈ షెడ్యూల్డ్ ఫ్రైటర్ సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయని జీఎమ్మార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఫ్రాంక్‌ఫర్డ్-ముంబై-హైదరాబాద్-ఫ్రాంక్ఫర్డ్లను కనెక్ట్ చేస్తూ బోయింగ్ 777 ఫ్రైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను లుఫ్తాన్సా నడుపుతున్నది.
ఈ సర్వీసులతో యూరప్, యూఎస్ మార్కెట్లకు ఉత్పత్తుల్ని చేరవేసేందుకు హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు రవాణా సదుపాయాలు పెరుగుతాయని జీఎమ్మార్ తెలిపింది. కొవిడ్‌కు ముందు 2019-20లో లుఫ్తాన్సా కార్గో ద్వారా 6,500 టన్నుల ఎగుమతులు, 1,500 టన్నుల దిగుమతులు జరిగాయన్నది. స్పైస్ జెట్ కార్గో విభాగమైన స్పైస్ ఎక్స్‌ప్రెస్ సైతం ఇటీవలే హైదరాబాద్ నుంచి హనోయి (వియత్నాం)కి ఫ్రైటర్ సర్వీసుల్ని ప్రారంభించిందని జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ తెలిపారు. త్వరలో మరిన్ని అంతర్జాతీయ ఎయిర్ కార్గో సర్వీసులు మొదలవుతాయన్నారు.