హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ఎంఎస్ఎంఈ ఫెస్టివ్ బొనాంజా కార్యక్రమంలో భాగంగా శనివారం హైదరాబాద్‌లో మెగా క్రెడిట్ క్యాంపును ఏర్పాటుచేసింది. బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితీశ్రంజన్ ఈ క్యాంపును ప్రారంభించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను పురస్కరించుకొని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు తక్కువ వడ్డీతో రుణాలిచ్చేందుకు నవంబర్ 15 నుంచి క్రెడిట్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ క్యాంపులకు పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ జోన్ పరిధిలో 400కుపైగా బిజినెస్ ఖాతాల్ని సమీకరించామని, వీటి విలువ రూ.1,600 కోట్లని పేర్కొన్నారు. క్యాష్‌లెస్ క్యాంపస్ లో భాగంగా తెలంగాణలోని 51 విద్యాసంస్థల్లో డిజిటల్ పేమెంట్ గేట్‌వేను ప్రారంభించామని, టీఎస్ఆర్టీసీకి ఫాస్టాగ్ సేవలను అందిస్తున్నామన్నారు.