SEBI Chief | స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్పర్సన్ మాధాబి పూరీ బుచ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాతోపాటు ఫిర్యాదు దారులను అవినీతి నిరోధక దర్యాప్తు సంస్థ లోక్‌పాల్ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆమె పరస్పర విరుద్ధ ప్రయోజనాలు, అక్రమాలకు పాల్పడుతున్నారన్న అమెరికా షార్ట్ షెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణల నేపథ్యంలో లోక్ పాల్ విచారణకు ఆదేశించింది. వచ్చేనెల విచారణకు రావాలని కోరింది. దీనిపై మహువా మొయిత్రాతోపాటు మరో ఇద్దరు లోక్ పాల్ కు ఫిర్యాదు చేశారు.
గత నెల ఎనిమిదో తేదీనే వివరణ ఇవ్వాల్సిందిగా మాధాబి పూరి బుచ్’ను లోక్ పాల్ ఆదేశించింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని బుచ్‌ను కోరింది. తదనుగుణంగా ఈ నెల ఏడో తేదీన బుచ్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీని ఆధారంగా ఓరల్ హియరింగ్ కు హాజరు కావాలని ఆదేశిస్తూ లోక్ పాల్ చైర్ పర్సన్ జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ ఈ నెల 19న ఆదేశాలు జారీ చేశారు. సెబీ చైర్ పర్సన్, ఫిర్యాదు దారులను విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేయాలని లోక్ పాల్ రిజిస్ట్రీని కూడా ఆదేశించింది. వచ్చేనెల 28న సెబీ చైర్ పర్సన్ మాధాబి పురి బుచ్, ఫిర్యాదు దారులు విచారణకు హాజరు కావాలని లోక్ పాల్ రిజిస్ట్రీ నోటీసులు జారీ చేయనున్నది.