క్రెడిట్ స్కోర్ బాగుంటే రుణాలు తేలిగ్గా లభిస్తాయి. అంతేకాదు.. ఆ రుణాలపై వడ్డీరేట్లూ తక్కువగానే ఉంటాయి. అందుకే క్రెడిట్ స్కోర్ దెబ్బతినేలా నడుచుకోవద్దు. అసలు క్రెడిట్ స్కోర్‌కు ఎసరు తీసుకొచ్చేవి ఏంటో తెలుసా..
రుణ చెల్లింపుల్లో వైఫల్యం
రుణ చెల్లింపుల్లో వైఫల్యాలు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. క్రెడిట్ కార్డ్ బకాయిలైనాసరే. లోన్ డిఫాల్టర్ అన్న ముద్ర.. క్రెడిట్ స్కోర్‌ను అమాంతం దిగజార్చేస్తుంది. అలాగే తీసుకున్న రుణాలకు సంబంధించిన చెల్లింపుల్లో ఆలస్యం కూడా ప్రమాదమే.
మితిమీరిన రుణాలు
రుణాల కోసం తరచూ ఎదురుచూడటం క్రెడిట్ స్కోర్‌కు ముప్పే. ముఖ్యంగా క్రెడిట్‌పై కొనుగోళ్లకు వెళ్లడం, చెల్లింపులకు క్రెడిట్ కార్డుల్నే వినియోగించడం పొరపాటు. మీ క్రెడిట్ కార్డుపై అధిక క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్) 30 శాతాన్ని మించిందా? అని బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు చెక్ చేస్తూ ఉంటాయి. సీయూఆర్ ఎక్కువగా ఉంటే క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది.
రుణాల కోసం అందరి వద్దకూ వెళ్లొద్దు
ఏదైనా రుణం కోసం బ్యాంకులన్నింటినీ సంప్రదించడం కూడా క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుంది. మీ పేరు మీద చాలా రుణాలున్నా ఇబ్బందే. ఇక తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తున్నా.. క్రెడిట్ స్కోర్ మెరుగుపడట్లేదని చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే దీని వెనకున్న కారణం క్రెడిట్ బ్యూరోలకు మీ రుణదాతలు సమాచారం ఇవ్వకపోవడం వల్లే. రుణాలు పూర్తయినా.. బ్యూరోలకు ఆ వివరాలు చేరవు. కాబట్టి క్రెడిట్ స్కోర్ చూసుకున్నప్పుడు తేడా గమనిస్తే.. రుణదాతల్ని సంప్రదించి పొరబాట్లను సరిదిద్దుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.