కోల్కతా, నవంబర్ 30: బీమా ప్రీమియంలపై జీఎస్టీ ఎత్తివేయాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నది. దీంతోపాటు బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే బీమా రంగంలో ఎఫ్డీఐల పరిమితి 74 శాతంగా ఉన్నదని, మిగతాది కూడా పెంచితే విదేశీ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశాలున్నాయని, అందుకోసం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(ఏఐఎన్లైఫ్) జనరల్ సెక్రటరీ వీ నరసింహన్ ఈ సందర్భంగా తెలిపారు.
దేశవ్యాప్త ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతు కూడబెడుతున్నట్లు చెప్పారు. అలాగే నూతన కార్మిక చట్టం కోడ్ను వ్యతిరేకిస్తున్నట్లు, పాత పెన్షన్ స్కీంను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు.