LIC in IndusInd Bank | ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్‌లో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వాటా పెరగనున్నది. ఈ మేరకు ఇండస్ ఇండ్ బ్యాంక్ శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. దీని ప్రకారం ఇండస్ ఇండ్ బ్యాంకులో ఎల్ఐసీ వాటా 9.99 శాతం పెరుగనున్నది. ప్రస్తుతం ఇండస్ ఇండ్ బ్యాంకులో 4.95 శాతం వాటాలు ఎల్ఐసీకి ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకులో షేర్ల కొనుగోలు, ఓటింగ్ హక్కులను ఎల్ఐసీ పెంచుకోవాలంటే సెబీ మార్గదర్శకాల ప్రకారం ఆర్బీఐ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ప్రైవేట్ బ్యాంకుల్లో కార్పొరేట్ ఓనర్‌షిప్‌పై అంతర్గతంగా ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ చేసిన పలు సిఫారసులను ఆర్బీఐ గత నెలలో ఆమోదించింది. దీని ప్రకారం ప్రైవేట్ బ్యాంకుల ప్రమోటర్ తొలి ఐదేండ్లు వాటి నిర్వహణకు అవసరమైన షేర్ హోల్డింగ్ కలిగి ఉండాలి. 15 ఏండ్ల తర్వాత నూతన పెట్టుబడి అవసరాల కోసం 15 శాతం నుంచి 26 శాతానికి పెంచుకునేందుకు ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ సిఫారసు చేసింది.
దీనివల్ల కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులకు లబ్ధి చేకూరనున్నది. తాజా నిర్ణయం వచ్చే ఏడాది డిసెంబర్ 8 వరకు అమలులో ఉంటుందని ఇండస్ ఇండ్ బ్యాంక్ తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈ ట్రేడింగ్‌లో ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు స్వల్పంగా పెరిగి రూ.947లకు చేరుకున్నాయి.