న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రాబోయే సంవత్సరాల్లో పొదుపు, రక్షణ, రిటైర్మెంట్ ప్రొడక్ట్స్‌కు దేశీయ మార్కెట్లో గొప్ప డిమాండ్ ఉంటుందని ప్రభుత్వ రంగ బీమా దిగ్గజ సంస్థ భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సీఈవో, ఎండీ ఆర్ దొరైస్వామి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికీ బీమా పాలసీదారులు తక్కువగానే ఉండటం, పెరుగుతున్న కుటుంబ ఆదాయాలు, ఆర్థిక అవగాహన, దీర్ఘకాల ఆయుర్దాయం, దేశ జీడీపీ ప్రగతి.. అన్ని కూడా ఇందుకు దోహదం చేస్తాయన్న ధీమాను కనబర్చారు. మంగళవారం ఎల్ఐసీ 70వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిమాండ్‌కు తగ్గట్టుగా పాలసీలను తీసుకొస్తున్నామని చెప్పారు.
ఈ క్రమంలోనే తమ పంపిణీ, ఉత్పత్తి కలగలిసిన విధానం మరింత పోటీయుతంగా ఉంటుందని, నేటి యువ కస్టమర్లకు వీలుగా డిజిటల్ మార్కెట్లోనూ దూకుడు పెంచామని.. ఇది ఎల్ఐసీ తదుపరి అధ్యాయాన్ని నిర్వచించగలదని వివరించారు. పార్లమెంట్ చట్టం ద్వారా 1956 సెప్టెంబర్ 1న ఎల్ఐసీ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం ప్రీమియం ఆదాయం రూ.5,35,984 కోట్లకు పెరిగింది. లాభం రికార్డు స్థాయిలో రూ.57,419 కోట్లుగా ఉన్నది. 2.5 కోట్ల వ్యక్తిగత, మెచ్యూరిటీ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేశారు. అలాగే 2025-26కుగాను రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేర్‌కు రూ.10 తుది డివిడెండ్‌ను ఎల్ఐసీ బోర్డు సిఫార్సు చేసింది. 2022లో ఐపీవో ద్వారా సంస్థ 3.5 శాతం వాటాను అమ్మి దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదైన సంగతి విదితమే. ఇక గత నెలలో జరిగిన ఆఫర్ ఫర్ సేల్‌లో 6.5 శాతం సర్కారీ వాటాను అమ్మకానికి పెట్టగా.. రూ.31,552 కోట్లు ఖజానాకు వచ్చాయి.
కొత్త పాలసీలు..: 70వ వార్షికోత్సవం సందర్భంగా ఎల్ఐసీ మంగళవారం రెండు ఆకర్షణీయమైన, సరికొత్త పాలసీలను పరిచయం చేసింది. బీమా ప్లాటినమ్, జీవన్ రక్ష పేరిట వీటిని సంస్థ ఎండీ దొరైస్వామి ఆవిష్కరించారని ఓ ప్రకటనలో ఎల్ఐసీ తెలిపింది.