న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ త్వరలో జారీచేయనున్న ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లో పాలుపంచుకునేందుకు తన పాలసీదారులకు ఒక కీలక సూచన చేసింది. ఐపీవోకు దరఖాస్తు చేయాలంటే అవసరమైన పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) వివరాల్ని కార్పొరేషన్ రికార్డుల్లో అప్డేట్ చేసుకోవాలని సూచించింది. నో-యువర్-కస్టమర్ నిబంధనల ప్రకారం షేర్లకు దరఖాస్తు చేయాలన్నా, కొనాలన్నా పాన్ తప్పనిసరి. అలాగే ఐపీవోలో పాలుపంచుకోవాలంటే… పాలసీ హోల్డర్లలో ప్రస్తుతం డీమ్యాట్ ఖాతా లేనివారు..ఒక డీమ్యాట్ ఖాతాను వారి సొంత ఖర్చుతో తెరవాలని ఎల్ఐసీ కోరింది. పాన్ కార్డు పొందడానికి, డీమ్యాట్ ఖాతాను తెరవడానికి, దానిని నిర్వహించడానికి అయ్యే వ్యయాల్ని పాలసీదారులే స్వయంగా భరించాలని ఒక బహిరంగ ప్రకటనలో సంస్థ స్పష్టంచేసింది.