ముంబై, అక్టోబర్ 6: దేశంలో అతిపెద్ద హోటల్ ముంబైలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ లెమన్ హోటల్..ఆర్థిక రాజధానిలో 669 గదులతో నిర్మించిన ఔరిక ముంబై స్కైసిటీని శుక్రవారం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న హాటళ్లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. అలాగే ఔరిక హోటల్స్ అండ్ రిసార్ట్ నిర్వహిస్తున్న మూడో హోటల్ ఇది.
ముంబైని సందర్శించే వారు రోజు రోజు పెరుగుతున్నారని, వీరికి హోటల్ గదులు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరిని దృష్టిలో పెట్టుకొని ఈ అతిపెద్ద హోటల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు లెమన్ ట్రీ హోటల్స్ సీఎండీ పతంజలి జీ కేశ్వానీ తెలిపారు. వచ్చే ఐదేండ్లకాలంలో మొత్తం గదుల సంఖ్యని 20 వేలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఈ స్టార్ హోటల్ ముంబై ఎయిర్‌పోర్ట్స్ టర్మినల్ 2కు దగ్గరలో ఉన్నది.