FMCG | న్యూఢిల్లీ, నవంబర్ 29: సబ్బుల ధరలకు రెక్కలొచ్చాయి. దేశంలో అతిపెద్ద ఎఫ్ఎంసీజీ సంస్థలు అన్ని రకాల సబ్బుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. పామాయిల్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడం వల్లనే వీటి ధరలను 7 శాతం నుంచి 8 శాతం వరకు పెంచాల్సి వచ్చిందని హెచ్‌యూఎల్, విప్రో సంస్థలు ప్రకటించాయి. సబ్బుల తయారీలో కీలక ముడి సరుకైన పామాయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమన్నది. దీంతో పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి సబ్బుల ధరలు పెంచకతప్పలేదని సంస్థలు పేర్కొన్నాయి. మార్జిన్లు తగ్గుముఖం పట్టడంతో వీటి ధరలను ప్రస్తుత త్రైమాసికంలో పెంచాల్సి ఉంటుందని గత త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు సందర్భంగా ప్రకటించాయి కూడా. సబ్బుల తయారీలో కీలక ముడిసరుకైన పామాయిల్ ధరలు గడిచిన ఏడాదికాలంలో 30 శాతం వరకు పెరిగాయని విప్రో కన్జ్యూమర్ కేర్ సీఈవో నీరజ్ ఖత్రియా తెలిపారు. మిగతా సంస్థలు కూడా తమ సబ్బుల ధరలను 7-8 శాతం వరకు పెంచుతాయని అనుకుంటున్నట్లు చెప్పారు. గడిచిన మూడు నెలల్లోనే పామాయిల్ ధరలు 35 శాతం నుంచి 40 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతోపాటు దిగుమతి సుంకం పెరగడం ఇందుకు కారణం. ప్రస్తుతం పది కిలోల పామాయిల్ ధర రూ.1,370గా ఉన్నది.
టీ పొడి ధరలు కూడా పెంచాయి సంస్థలు. అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా టీ ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం వల్లనే ధరలు సవరించాల్సి వచ్చిందని హెచ్‌యూఎల్, టాటా కన్జ్యూమర్ సంస్థలు ప్రకటించాయి. టీ పొడి ధరలను 25 శాతం నుంచి 30 శాతం వరకు సవరించినట్లు టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్ ఇప్పటికే ప్రకటించింది కూడా.
విప్రో కన్జ్యూమర్ కేర్..సంతూర్, చంద్రిక పేర్లతో సబ్బులను విక్రయిస్తున్నది.
హెచ్‌యూఎల్..డోవ్, లక్స్, లైఫ్‌బాయ్, లిరిల్, పీయర్స్, రెగ్జోనా బ్రాండ్లతో సబ్బులను అమ్ముతున్నది.
లక్స్ సబ్బు(5 సబ్బులు) ప్యాక్ ధర రూ.145 నుంచి రూ.155కి పెరిగింది.
లైఫ్‌బాయ్(5 సబ్బులు) ప్యాక్ విలువ రూ.155 నుంచి రూ.165కి పెంచారు.
ఐదు ప్యాక్ కలిగిన పీయర్స్ సబ్బుల ధర రూ.149 నుంచి రూ.162కి సవరించారు.