హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రముఖ ఫార్మా సంస్థ లారస్ ల్యాబ్ అంచనాలకు మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.195 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 875 శాతం వృద్ధిని కనబరిచింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 35 శాతం ఎగబాకి రూ.1,653 కోట్లకు చేరుకున్నది. కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్(సీడీఎంవో) సెగ్మెంట్‌తోపాటు జనరిక్ విభాగం భారీ వృద్ధిని నమోదు చేసుకోవడం కంపెనీకి కలిసొచ్చింది.
ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ సత్యనారాయణ చావా మాట్లాడుతూ..గత త్రైమాసికంలో సీడీఎంవో ఆదాయం 53 శాతం ఎగబాకి రూ.518 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో భారీ వృద్ది నమోదైందన్నారు. మరోవైపు, రూ.2 విలువ కలిగిన ప్రతిషేరుకు 40 శాతం లేదా 80 పైసలు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.