న్యూఢిల్లీ, జూన్ 22: వాట్సాప్ గ్లోబల్ సీఈవోగా క్రెడ్ వ్యవస్థాపకుడు కుణాల్ షా నియమితులయ్యారు. విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో వాట్సాప్ సీఈవోగా కుణాల్ షా బాధ్యతలు చేపట్టనున్నట్లు మెటా ప్రకటించింది. సాంకేతిక రంగంలో ఒక భారతీయ పారిశ్రామికవేత్తకు లభించిన అత్యంత ఉన్నతమైన పదవుల్లో ఒకటిగా ఇది నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వినియోగదారులు, చెల్లింపులు, వ్యాపార సందేశాలు, ఏఐ ఆధారిత ఫీచర్ల చుట్టూ పెరుగుతున్న వ్యాపారాలతో వాట్సాప్ ప్లాట్‌ఫామ్ విస్తరణలో ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నది.
భారత్‌లోని అత్యంత ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీల్లో ఒకటిగా తీర్చిదిద్దిన క్రెడ్ వ్యవస్థాపకుడిగా, ప్రొడక్ట్ బిల్డర్‌గా షాకు ఉన్న అనుభవం కొత్త ప్రయాణానికి నాయకత్వం వహించడానికి ఆయనను సరైన వ్యక్తిగా నిలుపుతుందని మెటా విశ్వాసం వ్యక్తం చేసింది. తమ దైనందిన జీవితంలో ప్రజలు వాట్సాప్‌ను ఎలా ఉపయోగిస్తారనే విషయమై షాకు బలమైన అవగాహన ఉండటంతోపాటు కంపెనీ బయటి నుంచి ఒక సరికొత్త దృక్పథాన్ని కూడా ఆయన తీసుకువస్తారని మెటా పేర్కొన్నది. వాట్సాప్‌కు అతిపెద్ద మార్కెట్ అయిన భారత్ బిజినెస్ మెసేజింగ్, చెల్లింపుల విషయంలో కూడా ఈ యాప్‌కు అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటిగా మారిందని, ఈ రెండు రంగాలు దాని భవిష్యత్ వృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ నియామకాన్ని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటిస్తూ ఒక వ్యవస్థాపకుడిగా షాకు ఉన్న ట్రాక్ రికార్డును ప్రశంసించారు.