Kia India | దక్షిణ కొరియా ఆటో మేజర్ ‘కియా ఇండియా (Kia India)’ వచ్చే ఏడాది నుంచి దేశీయంగా భారీగా విద్యుత్ కార్లను తయారు చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నది. 2030 నాటికి ఏటా నాలుగు లక్షల కార్ల విక్రయానికి చేరుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో కియా ఇండియా.. రూ.60.96 లక్షల (ఎక్స్ షోరూమ్)తో ఈవీ కారు ‘ఈవీ 6 (EV6)’ ఒక్కటే విక్రయిస్తోంది. తాజాగా గురువారం ‘ఈవీ9 (EV9)’, కియా కార్నివాల్ లగ్జరీ ఎంపీవీ సరికొత్త వర్షన్ కారును ఆవిష్కరించింది. ఈవీ9 కారు ధర రూ.1.3 కోట్లు ఉండగా, కియా కార్నివాల్ లిమౌసిన్ మోడల్ ధర రూ.63.90 లక్షలకు (ఎక్స్ షోరూమ్) లభిస్తుంది.
ఈవీ6 (EV6), ఈవీ9 (EV9) కార్లు రెండు కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)లుగా భారత్ మార్కెట్లోకి ఎంటరవుతాయి. వచ్చే ఏడాది భారత్ మార్కెట్లో మాస్ సెగ్మెంట్ లో ఈవీ కారు ఆవిష్కరిస్తామని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కియా ఇండియా ఎండీ కం సీఈఓ గ్వాంగు లీ తెలిపారు. ఎస్యూవీ సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింత సంఘటితం చేసుకోవాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మూడు నెలలుగా పడిపోతున్న కార్ల విక్రయాలు ప్రస్తుత పండుగల సీజన్లో పుంజుకుంటాయని కియా ఇండియా నేషనల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 2.5 లక్షల కార్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.