న్యూఢిల్లీ, ఆగస్టు 20 : కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. గడిచిన నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి రెండు నెలల కనిష్ఠ స్థాయి 2 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 6.3 శాతంతో పోలిస్తే భారీగా తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. జూన్ నెలలో నమోదైన 2.2 శాతంతో పోలిస్తే కూడా తగ్గింది. ఎనిమిది కీలక రంగాల్లో ఐదు రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడమే ఇందుకు కారణమని వెల్లడించింది. వీటిలో బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు ఉన్నాయి.
గత నెలలో ఎరువుల్లో వృద్ధి 2 శాతానికి పరిమితం కాగా, విద్యుత్‌లో వృద్ధి 0.5 శాతంగాను నమోదయ్యాయి. కానీ, స్టీల్ రంగం 12.8 శాతం వృద్ధిని కనబరచగా, సిమెంట్ 11.7 శాతం చొప్పున అధికమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలు(ఏప్రిల్ నుంచి జూలై వరకు) కీలక రంగాల్లో వృద్ధి 1.6 శాతానికి పరిమితమైంది. ఈ సందర్భంగా ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ మాట్లాడుతూ..బొగ్గు ఉత్పత్తి సగానికి సగం పడిపోవడంతో మొత్తం కీలక రంగాలపై పనితీరు ప్రభావం చూపిందని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా వర్షాలు అధికంగా కురియడం వల్లనే ప్రొడక్షన్‌పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందన్నారు.