హైదరాబాద్, డిసెంబర్ 2 : జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్.. హైదరాబాద్‌లో మానవ రహిత డ్రోన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి నగరానికి సమీపంలో మహేశ్వరం వద్ద నెలకొల్పుతున్న ఈ యూనిట్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి జేఎస్‌డబ్ల్యూ డిఫెన్ ఫౌండర్ పార్థ జిందాల్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పార్థ జిందాల్ మాట్లాడుతూ.. అమెరికాకు చెందిన షీల్డ్ ఏఐతో కలిసి నెలకొల్పుతున్న ఈ యూనిట్ నిర్మాణానికి రూ.850 కోట్ల వరకు నిధులు ఖర్చు చేయబోతున్నట్టు చెప్పారు. 16 ఎకరాలు 2.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పనున్న ఈ యూనిట్‌తో ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
వచ్చే ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్టు ఈ యూనిట్లో 300 యూనిట్ల మానవ రహిత డ్రోన్ల సామర్థ్యం కలిగివుండనున్నది. ఈ యూనిట్లో తయారుకానున్న డ్రోన్లను దేశీయ భద్రత దళాలతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కంపెనీ చేతిలో 500 మానవ రహిత డ్రోన్ల ఆర్డర్లు ఉన్నాయి. భవిష్యత్తులో డిమాండ్ ఉంటే ఈ సామర్థ్యాన్ని 450కి పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే సంస్థ కు ఛండీగఢ్‌లో యూనిట్ నెలకొల్పింది.