గురువారం 04 జూన్ 2020
Business - Apr 23, 2020 , 00:40:46

జియో-ఫేస్‌బుక్‌ 43,574 కోట్ల డీల్‌

జియో-ఫేస్‌బుక్‌ 43,574 కోట్ల డీల్‌

  • జియోలో 9.9% కొనుగోలు చేయనున్న సంస్థ
  • టెక్నాలజీలోకి వచ్చిన అతిపెద్ద ఎఫ్‌డీఐ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22: దేశీయ కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియోలో ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి పెడుతున్నది. జియోలో 9.9 శాతం వాటాను కొనుగోలు చేయడానికి 5.7 బిలియన్‌ డాలర్ల నిధులను వెచ్చిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.43,574 కోట్లు. ఫేస్‌బుక్‌తో కుదిరిన వాటా విక్రయ ఒప్పందంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అప్పులు భారీగా తగ్గనున్నాయి. అలాగే దేశీయ ఈ-కామర్స్‌ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్‌, వాల్‌మార్ట్‌లకు చెక్‌పెట్టినట్లు అవుతున్నది. దేశీయ టెక్నాలజీ రంగంలోకి వచ్చిన అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే కావడం విశేషం. ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థయైన జియోలో 5.7 బిలియన్‌ డాలర్లు లేదా రూ.43,574 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం’ అని ఫేస్‌బుక్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో జియోలో అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఫేస్‌బుక్‌ నిలువనున్నది. ప్రస్తుతం జియో మార్కెట్‌ విలువ రూ.4.62 లక్షల కోట్లుగా ఉన్నదని ఆర్‌ఐఎల్‌ మరో ప్రకటనలలో వెల్లడించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో ఫేస్‌బుక్‌కు  9.9 శాతానికి సమానమైన షేర్లు లభించనుండగా, జియో బోర్డులో కూడా చోటు దక్కనున్నది. ప్రస్తుతం ఈ బోర్డులో ముకేశ్‌ అంబానీ పిల్లలు ఇషా, ఆకాశ్‌లు ఉన్నారు. ఈ వాటా కొనుగోలు ఒప్పందానికి గతేడాది నవంబర్‌లోనే పునాది పడినట్లు తెలుస్తున్నది. ఇక వచ్చే ఏడాది నాటికి జియోను అప్పులు లేని సంస్థగా తీర్చిదిద్దాలనుకున్న ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ.. వాటా విక్రయంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందం మార్చి 31 లోపు పూర్తి చేయాలనుకున్నప్పటికీ, కరోనా వైరస్‌తో వాయిదాపడింది. కాగా, ఈ ఒప్పందానికి కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా  (సీసీఐ) గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 

10 శాతం లాభపడ్డ ఆర్‌ఐఎల్‌ షేరు

ఫేస్‌బుక్‌తో కుదుర్చుకున్న వాటా ఒప్పందంతో స్టాక్‌ మార్కెట్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు అమాంతం దూసుకెళ్లింది. ఇంట్రాడేలో 12 శాతానికి పైగా లాభపడిన కంపెనీ షేరు ధర మార్కెట్‌ ముగిసే సమయానికి  10.30 శాతం లాభంతో రూ.1,365.35 వద్ద స్థిరపడింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ షేరు 9.83 శాతం ఎగబాకి రూ.1,359 వద్ద ముగిసింది. దీంతో మార్కెట్‌ విలువ రూ.80,710 కోట్లు పెరిగి రూ.8,64,267.70 కోట్లకు చేరుకున్నది.  

ముఖ్యాంశాలు

  • 2016 నుంచి ఇప్పటి వరకు జియో కోసం ఆర్‌ఐఎల్‌ ఏకంగా 50 బిలియన్‌ డాలర్ల మేర ఖర్చు చేసింది. 
  • గతేడాది డిసెంబర్‌ నాటికి ఆర్‌ఐఎల్‌కు మొత్తంగా రూ.3,06,851 కోట్ల మేర రుణం ఉన్నది. ఇదే సమయంలో సంస్థ చేతిలో రూ.1,53,719 కోట్ల మేర నగదు నిల్వలు ఉండటంతో సంస్థ అప్పు రూ.1,53,132 కోట్లకు తగ్గనున్నది.
  • భారత్‌లో వాట్సప్‌నకు 40 కోట్లు, జియోకు 38 కోట్లు, ఫేస్‌బుక్‌నకు 25 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 
  • బ్యాలెన్స్‌ షీట్‌ను మెరుగుపరుచుకునే ఉద్దేశంలో భాగంగా ఆర్‌ఐఎల్‌ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నది. 
  • చైనా తర్వాత భారత్‌లో అత్యధిక మంది వినియోగదారులున్న ఫేస్‌బుక్‌కు ఈ ఒప్పందం కీలకంగా మారింది. ప్రాంతీయ 
  • భాగస్వాములతో కలిసి ఇక్కడ పేమెంట్‌ రంగంలోకి అడుగు పెట్టాలని యోచిస్తున్నది. 
  • 2014 తర్వాత ఫేస్‌బుక్‌ కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందం ఇదే. గతంలో వాట్సప్‌లోనూ వాటాను కొనుగోలు చేసింది. 


జియోలోకి ఫేస్‌బుక్‌ పెట్టుబడులను స్వాగతిస్తున్నాం. త్వరలోనే జియో మార్ట్‌, వాట్సప్‌ల ద్వారా 3 కోట్ల చిన్న కిరాణాలను డిజిటలైజ్‌ చేసి పూర్తిగా డిజిటల్‌ చెల్లింపులు జరిపేందుకు ప్రోత్సాహం అందివ్వనున్నాం. దీని ద్వారా సమీపంలోని కిరాణాల నుంచి రోజువారి సరుకులు తెచ్చుకోవడానికి వీలుంటుంది. అలాగే సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్న రైతులు, చిన్న-మధ్య తరహా పరిశ్రమలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య రంగం, మహిళలు, యువకులు ఇలా ప్రతి ఒక విభాగానికి సేవలను విస్తరించాలనుకుంటున్నాం.

- ముకేశ్‌ అంబానీ, ఆర్‌ఐఎల్‌ చైర్మన్‌


భారత్‌లో అన్ని రంగాలకు విస్తరించాలనే ఉద్దేశంతో జియోతో జతకట్టినాం. ప్రజలు, వ్యాపారం కోసం సరికొత్త మార్గాలను అన్వేషించేందుకు కృషి చేస్తున్నాం. దేశీయ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియోలో ఈ భారీ పెట్టుబడులు పెట్టడం జరిగింది. భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించాలనే తమ నిర్ణయానికి ఈ తాజా పెట్టుబడులు నిదర్శనం. డిజిటల్‌ దిశగా భారత్‌ వేగంగా అడుగులు వేస్తున్నది. చిరు వ్యాపారులు సైతం ఆన్‌లైన్‌లోనే సరుకులను విక్రయిస్తున్నారు. 

  - జుకర్‌బర్గ్‌, ఫేస్‌బుక్‌ సీఈవో


logo