Jet Airways 2.0 | మూడేండ్ల క్రితం నేలకు పరిమితమైన ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్వేస్ విమానాలు త్వరలో టేకాఫ్ తీసుకోనున్నాయి. వచ్చే సెప్టెంబర్ నెలాఖరులోగానీ, అక్టోబర్‌లో గానీ జెట్ ఎయిర్వేస్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేశామని సంస్థ సీఈవో సంజీవ్ కపూర్ తెలిపారు. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టామని అన్నారు. వచ్చేనెల ప్రారంభంలో ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ లభిస్తుందని జెట్ ఎయిర్వేస్ భావిస్తున్నది.
మే నెలాఖరులో విమానాల టెస్టింగ్ ప్రారంభం అవుతుందని సంజీవ్ కపూర్ అన్నారు. విమాన సర్వీసుల పునఃప్రారంభం చాలా సంక్లిష్టం.. సుదీర్ఘ కాలం జరిగే ప్రక్రియ అయినా.. తుది దశకు చేరుకున్నదని తెలిపారు. ఎయిర్ ఆపరేటర్ పర్మిట్ (ఏవోపీ) తర్వాత ఆపరేషన్ల నిర్వహణ ప్రారంభం అవుతుందన్నారు.
1990వ దశకం ప్రారంభంలో జెట్ ఎయిర్వేస్ ప్రారంభమైంది. టికెటింగ్ ఏజెంట్ కం పారిశ్రామికవేత్త నరేశ్ అగర్వాల్ సారధ్యంలో జెట్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు మొదలయ్యాయి. మహారాజాగా పేరొందిన ఎయిరిండియాకు ఆల్టర్నేటివ్గా జెట్ ఎయిర్వేస్ తీసుకొస్తున్నట్లు అప్పట్లో నరేశ్ అగర్వాల్ చెప్పుకున్నారు. ఒకానొక దశలో జెట్ ఎయిర్వేస్ 120 విమానాలు నడిపింది.
`ది జాయ్ ఆఫ్ ఫ్లయింగ్` ట్యాగ్‌లైన్‌తో జెట్ ఎయిర్వేస్ సేవలు నిర్వహించింది. జెట్ ఎయిర్వేస్ సేవలు జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న వేళ 650 విమానాలను నడిపింది. కానీ మూత పడే నాటికి కేవలం 16 విమానాలకు పరిమితమైంది. 2019 మార్చి నెలాఖరు నాటికి జెట్ ఎయిర్వేస్ భారీ రుణ భారంతో రూ.5,535.75 కోట్ల నష్టాలను చవి చూసింది. 2019 ఏప్రిల్ 17న మూత పడినట్లు అధికారికంగా ప్రకటించారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆధ్వర్యంలో వేలం బిడ్‌ను జలాన్ కల్రాక్ కన్సార్టియం గతేడాది జూన్‌లో గెలుచుకుంది.